NZ Vs BAN: కివీస్‌కు వరుసగా మూడో విజయం - న్యూజిలాండ్ చేతిలో బంగ్లా చిత్తు
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న న్యూజిలాండ్ మూడో విజయాన్ని నమోదు చేసింది.
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న న్యూజిలాండ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. గాయం నుంచి కోలుకుని రెండు మ్యాచ్‌ల తర్వాత బరిలోకి దిగిన సారధి కేన్స్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడిన వేళ బంగ్లాదేశ్‌పై ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ డేరిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ రాణించడంతో 42.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లకు న్యూజిలాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్... లిట్టన్‌దాస్‌ను అవుట్ చేసి బంగ్లాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అనంతరం తన్జిద్ హసన్‌తో జత కలిసిన హసన్ మిరాజ్ కాసేపు న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. కానీ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన అనంతరం 16 పరుగులు చేసిన తన్జిద్ హసన్‌ను ఫెర్గ్యూసన్ అవుట్ చేశాడు. మరో 16 పరుగులు జోడించగానే 30 పరుగులు చేసిన హసన్ మిరాజ్‌ను అవుట్ చేశాడు. 56 పరుగుల వద్దే నాలుగో వికెట్ కూడా కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది.
కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాదేశ్‌ను సారధి షకీబ్ అల్ హసన్, ముష్ఫకీర్ రహీమ్ ఆదుకున్నారు. అయిదో వికెట్‌కు...... 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. షకీబ్ అల్ హసన్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ముష్ఫకీర్ రహీమ్ 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్‌ను ఫెర్గ్యూసన్... ముష్ఫకీర్ రహీమ్‌ను హెన్రీ పెవిలియన్‌కు పంపారు. 13 పరుగులు చేసిన హ్రిడాయ్‌ను బౌల్ట్ అవుట్ చేయడంతో బంగ్లా 180 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం మహ్మదుల్లా పోరాడడంతో బంగ్లా మళ్లీ పోరులోకి వచ్చింది. 41 పరుగులతో మహ్మదుల్లా రాణించడంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఫెర్య్గూసన్ 3, బౌల్ట్ 2, హెన్రీ 2, శాట్నర్, ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 12 పరుగుల వద్ద రచిన్ రవీంద్రను ముస్తాఫిజుర్ అరెస్ట్ చేశాడు. అనంతరం కాన్వేతో జత కలిసిన సారధి కేన్ విలియమ్సన్ జట్టును విజయతీరాల వైపు నడిపించాడు. జట్టు స్కోరు 92 పరుగుల వద్ద 45 పరుగులు చేసిన కాన్వే అవుటయ్యాడు. ఈ ఆనందం బంగ్లాకు ఎక్కువసేపు నిలువలేదు. మరో వికెట్ పడకుండా కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. 78 పరుగులు చేసిన విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. డేరిల్ మిచెల్ 67 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 89 పరుగులు చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన మిచెల్ మరో వికెట్ పడకుండా కివీస్‌కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించినట్లయింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial