Ind Vs Eng Odi Series Update: ప్రస్తుత ఇంగ్లాండ్ వాడిని కోల్పోయింది.. అలా ఓడటం ఆనవాయితీగా వస్తోందని ఆ దేశ దిగ్గజ కెప్టెన్ విమర్శలు
తాజా ఇంగ్లాండ్ జట్టు అప్పటి వాడిని కోల్పోయిందని నాసర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. అటు టీ20, ఇటు వన్డేల్లోనే ప్రభ మసకబారిదన్నాడు. ఆదివారం భారత్ తో కటక్ వేదికగా రెండో వన్డే ను ఇంగ్లాండ్ ఆడనుంది.

Nasser Hussain Comments: గత కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్ లో పట్టు కోల్పోయిందన్నది కాదనలేని సత్యం. 2015 వన్డే ప్రపంచకప్ ఓడిపోయాక, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ లో ఇంగ్లాండ్ ప్రపంచంలోనే బలమైన జట్టుగా ఎదిగింది. దూకుడే మంత్రంగా పాటిస్తూ, సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ను కూడా సాధించింది. దీంతో క్రికెట్ కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ కు వరల్డ్ కప్పు సాధించలేదనే అప ప్రథను తొలగించుకుంది. అప్పట్లో మోర్గాన్, కోచ్ ట్రేవర్ బేలిస్ కలిసి వైట్ బాల్ క్రికెట్ లో బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. ఈకాలంలో ఎన్నో రికార్డులతో ప్రత్యర్థులలో ఒకరకమైన భయాన్ని నెలకొల్పగలిగింది. అయితే తాజా ఇంగ్లాండ్ జట్టు అప్పటి వాడిని కోల్పోయిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. అటు టీ20, ఇటు వన్డేల్లోనే ఆ జట్టు ప్రభ మసకబారిదని వ్యాఖ్యానించాడు.
భంగపాటు..
ఈనెల 19 నుంచి పాకిస్థాన్ లో జరిగే ఐసీసీ చాంపియన్ష్ షిప్ కు సన్నాహకంగా ఇండియా టూర్ కు వచ్చిన ఇంగ్లాండ్.. ఘోర పరభవాన్ని మూటకట్టుకుంది. టీ20 సిరీస్ ను 4-1తో ఓడిపోయిన ఇంగ్లీష్ జట్టు.. వన్డే సిరీస్ లోనూ 0-1తో వెనుకంజలో నిలిచింది. తాజా జట్టు పరిస్థితిపై నాసర్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ఒకరకమైన పద్ధతిలో ఇంగ్లాండ్ ఆటతీరు కొనసాగుతోందని విమర్శించాడు. ముందుగా లభించిన ఆరంభాన్ని తర్వాత వేస్ట్ చేసుకోవడం, ఆ తర్వాత స్పిన్నర్లకు దాసోహమయ్యి మ్యాచ్ లను చేజార్చుకోవాడం ఆనవాయితీగా వస్తోందని ఆక్షేపించాడు. గత టీ20 సిరీస్ లో జరిగిన విషయాలే ఇప్పుడు కూడా జరిగాయని విమర్శించాడు. గతంలో మోర్గాన్, బేలిస్ కాలంలో ఉన్నంత పటష్టంగా ప్రస్తుత ఇంగ్లాండ్ టీమ్ లేదని పేర్కొన్నాడు.
ఇండియాతో చాలా మెరుగు..
ఇంగ్లాండ్ తో పోలిస్తే ఇండియా చాలా విషయాల్లో మెరుగ్గా కనిపిస్తోందని నాసర్ ప్రశంసించాడు. టీ20ల్లో విధ్వంసకరమైన అభిశేక్ శర్మలాంటి ప్లేయర్లు సత్తా చాటారని, వన్డేల్లో శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, స్పిన్నర్లలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నారని తెలిపాడు. 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ ఇలా రెండు ఫార్మాట్ల ఫైనల్లో ఆడారని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇండియా అంతకుముందు జరిగిన 2023 టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఆడి మూడు ఫార్మాట్లలో తన సత్తా చాటా చాటుకుంది.
మరోవైపు తొలి వన్డేలో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఆడకున్నా జట్టు ఏమాత్రం తడబడకుండా ఈజీగా గెలిచిందని నాసర్ తెలిపాడు. గత కొంతకాలంగా ఏ ప్లేయర్ ను పరీక్షించిన భారత్ పాలిట అతను సక్సెస్ అవుతున్నాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తప్పుల నుంచి పాఠాలు నేర్వాలని, లేకపోతే కష్టమని తెలిపాడు. ఇక భారత్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. దీంతో ఆదివారం కటక్ లో జరిగే రెండో వన్డేలో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడిలో పడిపోయింది. ఇక ఈనెల 19 నుంచి ప్రారంభమవుతున్న చాంపియన్స్ ట్రోఫీలో ప్రమాదకర ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఉన్న గ్రూపులో ఇంగ్లాండ్ ఆడుతోంది. ఆ రెండు జట్లను ఓడించాలంటే స్థాయికి మించి ప్రదర్శన చేయక తప్పదు.
Also Read: Bumrah Injury Update: బుమ్రా గాయంపై ఉత్కంఠ.. మరికొన్ని గంటల్లో రానున్న స్పష్టత..! తరుముకొస్తున్న మెగాటోర్నీ గడువు!!




















