Ind vs Eng 3rd Test: టీ బ్రేక్ లోపే అవుట్ అయిన రోహిత్ శర్మ
India vs England 3rd Test Day 3: రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌటయ్యింది.
India vs England 3rd Test Day 3 : మూడో రోజు ఆటలో టీ విరామానికి రెండో ఇన్నింగ్స్ మోదలు దలు పెట్టిన భారత్ ఒక వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ , శుభ్‌మన్ గిల్లు క్రీజులో ఉన్నారు. భారత్ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. 126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అతి త్వరగా జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అవ్వడం తో ఆదిలోనే షాక్ తగిలింది.
రాజ్‌కోట్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. దాంతో, టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. లంచ్‌కు ముందు 290/ 5తో పటిష్ట స్థితిలో కనిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మరో 29 పరుగులకే ఆట ముగించేసింది.
భారత బౌలర్లలో సిరాజ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ , బెన్ ఫోక్స్ తో కలిపి నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. అప్పటికే ఆలౌట్ ప్రమాదంలో పడిన ఇంగ్లండ్.. పది పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఐదు వికెట్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టడం గమనార్హం.
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.ఈ విషయం పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టత నిచ్చింది. భారత మాజీ కెప్టెన్, టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించారని సోషల్ మీడియాలో బీసీసీఐ తెలిపింది.
ఈయన టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ తండ్రి. జూన్ 1952లో ఇంగ్లండ్ పై టీమిండియా తరఫున తొలి టెస్ట్ ఆడిన గైక్వాడ్ 9 ఏళ్ల పాటు 11 టెస్టులు ఆడాడు. 350 పరుగులు చేశాడు. వాటిలో నాలుగు టెస్టులకు కెప్టెన్ గా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బరోడా తరఫున 17 ఏళ్ల పాటు ఆడాడు. 1947 నుంచి 1964 మధ్య 110 మ్యాచ్ లలో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలతో 5788 రన్స్ చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ తన చివరి టెస్టును 1961లో పాకిస్థాన్ పై ఆడారు.
2016లో 87 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ తర్వాత దేశంలో జీవించి ఉన్న ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ ట్యాగ్ ఈ దత్తాజీరావు గైక్వాడ్ పేరుకి మారింది. వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న దత్తాజీరావు ఫిబ్రవరి 13 మంగళవారం మరణించారు. దత్తాజీరావు గైక్వాడ్ తనయుడు అన్షుమన్ గైక్వాడ్ కూడా ఇండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత టీమిండియా కోచ్ గానూ పని చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ మరణానికి ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది.
భారత ఇన్నింగ్స్ ముగిసిందిలా..
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా సెంచరీ హీరోలుగా నిలువగా తొలిసారి బరిలో దిగిన బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ , ధ్రువ్ జురెల్కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓవర్నైట్ 326/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా రెండు పరుగులు మాత్రమేచేసి పెవిలియన్ బాట పట్టాడు. జో రూట్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో డెబ్యూ ప్లేయర్ ధ్రువ్ జరెల్‌తో కలిసి సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు స్కోరు ముందుకు తీసుకెళ్లాడు. ఎనిమిదో వికెట్కు వీరు 77 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. చివర్లో బుమ్రా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. మూడో టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది.