ICC ODI WC 2023: ఏం తమాషాలా? - మీ ఇష్టమొచ్చినట్టు షెడ్యూల్‌ను మార్చుతారా! - పీసీబీపై ఐసీసీ, బీసీసీఐ ఆగ్రహం
ఆసియా కప్-2023 నిర్వహణ వివాదం ముగిసిపోవడంతో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు వస్తానని చెప్పిన పీసీబీ తర్వాత గొంతెమ్మ కోరికలు కోరుతోంది.
ICC ODI WC 2023: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు రోజుకో కొర్రీ పెడుతూ అసలు ఆడతారో లేదో స్పష్టంగా చెప్పకుండా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా వేదికలను మార్చడం కుదరదని, సాలిడ్ రీజన్ లేనిదే వాటిని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.
పీసీబీ గొంతెమ్మ కోరికలు..
ఆసియా కప్-2023 నిర్వహణ వివాదం ముగిసిపోవడంతో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు వస్తానని చెప్పిన పీసీబీ తర్వాత గొంతెమ్మ కోరికలు కోరుతోంది. మొదట్నుంచి తాము అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడమని చెబుతున్న పీసీబీ.. తర్వాత మరో రెండు వేదికలు కూడా మార్చాలని పట్టుబడుతున్నది.
బీసీసీఐ.. ఐసీసీకి పంపిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య బెంగళూరులో మ్యాచ్ షెడ్యూల్ చేసింది. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ కొత్తరాగం అందుకుంది. ఎందుకంటే చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. అఫ్గాన్ టీమ్‌లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజ్బీర్ రెహ్మాన్ త్రయం చూసి పాక్ భయపడుతోంది. ఇక్కడ ఆడితే బాబర్ ఆజమ్ గ్యాంగ్.. అఫ్గాన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకోవడం ఖాయమని పీసీబీ ఆందోళన చెందుతున్నది.
ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో ఇక్కడ పరుగుల వరద పారింది. ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడితే తమ బౌలింగ్ ను ఆసీస్ బ్యాటర్లు తుత్తునీయలు చేస్తారని పీసీబీ భయం. అదీగాక ఇక్కడ షార్ట్ బౌండరీస్ కూడా తమ కొంపముంచుతాయని పీసీబీ భావిస్తున్నది.
అయితే ఈ విషయంలో పీసీబీ ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ‘ఆస్ట్రేలియాతో బెంగళూరులో, అఫ్గాన్‌తో చెన్నైలో మ్యాచ్ వేదికలను మార్చాలని మేం కోరుతున్నాం. మేం వీటిని అటుది ఇటు ఇటుది అటూ ఆడిస్తే బెటర్ అని భావిస్తున్నాం. అంటే చెన్నైలో ఆసీస్‌తో బెంగళూరులో అఫ్గాన్‌తో ఆడితే మాకు సమ్మతమే..’అని పీసీబీ ఐసీసీకి నోట్ రాసినట్టు ఈఎస్పీఎన్ ఓ కథనంలో పేర్కొంది.
బీసీసీఐ, ఐసీసీ తిరస్కరణ..
పాకిస్తాన్ ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ ముక్తకంఠంతో ఖండించినట్టు క్రిక్ బజ్ నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు వేదికలను మార్చడానికి ఇవేం గల్లీ క్రికెట్, క్లబ్ క్రికెట్ కాదని, ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే వరల్డ్ కప్ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘ఏదైనా భద్రతా కారణమో లేక మ్యాచ్ ఆడబోయే పిచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా లేదంటేనే వేదికలను మార్చడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప మేం ఇక్కడ ఆడితే బాగా ఆడలేం.. ఈ వేదికలే కావాలంటే కుదరదు..’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీనిపై బీసీసీఐ, ఐసీసీలు పాకిస్తాన్‌కు కూడా గట్టిగానే హెచ్చరించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే పాకిస్తాన్ వ్యవహార తీరు వల్ల వరల్డ్ కప్ షెడ్యూల్ జాప్యం అవుతోంది. వన్డే వరల్డ్ కప్‌కు ఓసారి వస్తామని, ఓసారి తమ ప్రభుత్వ అనుమతి కావాలని పూటకో మాట మాట్లాడుతున్న పీసీబీ.. తమ ఆందోళన ఏదున్నా రెండు మూడు రోజుల్లో పరిష్కరించుకోవాలని ఐసీసీ ఇదివరకే తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. అన్నీ కుదిరితే జూన్ 27న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial