Ind Vs Eng Oval Test Updates: ఇంగ్లాండ్ కోరుకున్నట్లుగా పిచ్..! అందుకు తగ్గట్లుగా ప్లేయింగ్ XI.. 5వ టెస్టులో గెలవాలని ఇంగ్లీష్ జట్టు ఆరాటం.. టీమిండియా ప్లేయింగ్ XI పై ఉత్కంఠ
దాదాపు 45 రోజులపాటు సాగుతున్న ఇంగ్లాండ్ పర్యటన ద ఓవల్ టెస్టు తర్వాత ముగింపునకు రానుంది. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది.

Ind vs eng The Oval Test Seamers Friendly..?: ఇంగ్లాండ్ పర్యటనలో అసలైన సవాలు ద ఓవల్ టెస్టులో ఎదురు కానుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా తొలి నాలుగు టెస్టులలో దాదాపు బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ లనే రూపొందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. తొలి సారిగా సీమర్లకు అనుకూలించే వికెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లండన్ లోని ద ఓవల్ మైదానంలో పచ్చికతో నిండి ఉంది. మ్యాచ్ ముందు వరకు ఈ పచ్చికను తొలగించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ సీమర్లకు అనుకూలించే అవకాశముంది. ఈక్రమంలోనే ఇంగ్లాండ్ స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండానే తుదిజట్టును ప్రకటించింది. ఇప్పుడు భారత ప్లేయింగ్ లెవన్ ఏ విధంగా ఉండబోతోందో అని ప్రశ్నలు వేధిస్తున్నాయి.
తొలిసారి కోరుకున్నట్లుగా..
ఇక ఈ సిరీస్ లో తాము కోరుకున్నట్లుగా సీమర్స్ ఫ్రెండ్లీ వికెట్ లభించబోతోందని ఇంగ్లాండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అయితే గాయం కారణంగా తను ఈ టెస్టులో ఆడటం లేదు. అలాగే జట్టులో నాలుగు మార్పులను కూడా చేశారు. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, బ్రైడెన్ కార్స్ స్థానాల్లో జాకబ్ బెతెల్, జోష్ టంగ్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్ లను జట్టులోకి తీసుకున్నారు. ఈక్రమంలో స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. జో రూట్, బెతెల్ స్పిన్నర్ బాధ్యతలను మోస్తారు. ఇక ఈ టెస్టులో భాగంగా ఆగస్టు 1న మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ కు నివాళీ అర్పించనున్నట్లు ఈసీబీ తెలిపింది. గతేడాది ఆగస్టు 4న డిప్రెషన్, యాంక్జైటీ తదితర అనారోగ్యంతో తను ఆత్మహత్య చేసుకున్నాడు. 1993-2000 వరకు తన కెరీర్ సాగగా ఓవరాల్ గా 100 టెస్టులు ఆడాడు. ఇందులో 6,744 పరుగులు, 16 సెంచరీలు చేశాడు. అలాగే వన్డేల్లో 2380 పరుగులు, 21 ఫిఫ్టీలు నమోదు చేశాడు.
టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఎలా..?
ఇక వికెట్ సీమర్లకు అనుకూలిస్తుండటంతో భారత్ కూడా స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండానే ఆడబోతోంది. నిజానికి తొలి నాలుగు టెస్టుల్లో టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లతోనే ఆడింది. ఇందులో జడేజా నాలుగు టెస్టులు ఆడగా, సుందర్ 3 టెస్టులు ఆడాడు. జట్టులో ఏకైక స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడకుంటే అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేయడం ఖాయంగా మారింది. అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాశ్ దీప్ ఆడుతుండగా, మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశముంది. సీమర్లకు అవకాశం ఉండటంతో శార్దూల్ ఠాకూర్ కు మరో చాన్స్ లభించవచ్చు. గత మ్యాచ్ లో తన బౌలింగ్ లో విఫలమైనా, బ్యాటింగ్ లో రాణించాడు. ఏదైమనా టీమిండియా ఫైనల్ లెవన్ షరామాములుగానే టాస్ తర్వాత తెలుస్తుంది. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.




















