Tataiahgunta Gangamma : తిరుపతి గంగమ్మకు శ్రీవారి ఆలయం నుంచి సారె..చల్లంగ చూడమ్మా గంగమ్మా!
Tataiahgunta Gangamma Festival : తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం టీటీడీ తరపున అమ్మవారికి సారె సమర్పించనున్నారు

Tataiahgunta Gangamma Festival 2025: తిరుపతి గంగమ్మ జాతర కన్నులపండువగా జరుగుతోంది. బండ వేషాలతో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఒళ్లంతా కుంకుమ రాసుకుని నల్లని కాటుక బొట్టు పెట్టుకుని తెల్ల చుట్టుకుని బండ వేషాలు వేసుకున్నారు. పాటలు పాడుతూ డప్పు వాయిద్యాల నడుమ లయబద్ధంగా నాట్యం చేస్తూ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పొంగలి నివేదించారు.
తిరుపతి గంగమ్మ జాతర కన్నులపండువగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏటా అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మే 10 శనివారం తిరుమల నుంచి సారె గోవిందరాజు స్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంటుంది. ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్, అధికారులు, ప్రజాప్రతి నిధులు పాల్గొంటారు.
గంగమ్మ జాతరను పురస్కరించుకుని అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకోసం ఉత్సవకమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మజ్జిగ, అంబలి, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. MLA ఆరణి శ్రీనివాసులు, ఉప మేయర్ RC మునికృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ MLA సుగుణమ్మ, యాదవ కార్పొ రేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు అందుతున్న సేవల ఎలా ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి సోదరిగా భావించే తిరుపతి గంగమ్మను పిలిస్తే పలికే దైవంగా భక్తులు పూజిస్తారు. తిరుపతి తాతయ్యగుంటలో ఉన్న ఈ ఆలయంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఏటా చైత్రమాసం చివరి మంగళవారం రోజు జాతర ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటూ వైభవంగా జాతర నిర్వహించిన తర్వాత నాలుగో రోజు శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె సమర్పిస్తారు టీటీడీ అధికారులు. మొదటిరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తంభానికి అభిషేకం నిర్వహించి.. సాయంత్రం గంగమ్మ పుట్టినిల్లుగా భావించే అవిలాల నుంచి కైకాల కులపెద్దలు సారెను తీసుకొచ్చి సమర్పించారు. అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో కుంకుమ, పసుపు చల్లి...జాతర పూర్తయ్యేవరకూ ఎవరూ పొలిమేర దాటకూడదని నియమం విధిస్తారు. పురుషులంతా జాతరలో భాగంగా స్త్రీ వేషం ధరించి తిట్టడం ప్రారంభిస్తారు..అలా చేస్తే గంగమ్మ ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఐదోరోజు మాతంగి వేషం వేసుకుంటారు. చివరిరోజున విశ్వరూప దర్శనంలో భాగంగా కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని బంకమట్టిని నీలంరంగు ద్రవంతో కలిపిన అమ్మవారి రూపాన్ని తయారు చేస్తారు. అర్థరాత్రి తర్వాత ఆవిగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఓ వ్యక్తి ముత్తైదువ రూపంలో వచ్చి విగ్రహంలో చెంపను ధ్వంసం చేస్తారు..అందులో మట్టిని ప్రసాదంగా అందిస్తారు. ఈ ఘట్టంతో జూతర పూర్తవుతుంది
తిరుపతి గ్రామీణ మండలంలో రెండు రోజులుగా జరిగిన గంగమ్మ జాతర గురువారం ముగిసింది. అవిలాల, వేదాంతపురం, చిగురువాడ, వడ్డిపల్లి, దుర్గస ముద్రం, తుమ్మలగుంట, పేరూరు, పెరుమాళ్లపల్లి, సి. మల్ల వరం, పాతకాల్వ, గాంధీ నగర్, గొల్లపల్లి గ్రామాల్లో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పులు వాయిస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాంతింపజేసి గ్రామాల్లో పొలిమేరకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా జతరకు ముగింపు పలికారు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















