Saraswati River Pushkaralu 2025: బయటకు కనిపించని సరస్వతి నది.. మరి పుష్కర స్నానం ఎక్కడ చేయాలి!
Saraswati River Pushkaralu May 15 to 26, 2025: ఈ ఏడాది సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వది నదీ పుష్కర స్నానం ఎక్కడ చేయాలో పూర్తి వివరాలు ఇవిగో...

Saraswati River Pushkaralu 2025: హిందువుల సంప్రదాయాలన్నీ పవిత్ర స్నానాలతో ముడిపడి ఉంటాయి. ఇందులో భాగంగా సందర్భాన్ని బట్టి నదీ స్నానం, కోనేటి స్నానం, సముద్ర స్నానం, మంగళస్నానాలు చేస్తారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితోనే ముడిపడి ఉంటుంది. సాధారణంగా నదీ స్నానం ఉత్తమం...పుష్కర సమయంలో నదీ స్నానం అత్యుత్తమం. ఏడాదికి ఓ నదికి చొప్పున మొత్తం 12 నదలుకు 12 సంవత్సరాలుకు ఓసారి పుష్కరాలొస్తాయి. 2025 సంవత్సరంలో సరస్వతి నదికి పుష్కరాలొస్తున్నాయ్.
బృహస్పతి మిధున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు మొదలవుతాయి. అయితే సరస్వతీ నదీ ఎక్కడా కూడా ప్రత్యేకంగా ప్రవహిస్తూ కనిపిందు. అంతర్వాహినిగా ఉంటుంది. మే 15 నుంచి మే 26 వరకు మొత్తం 12 రోజుల పాటు వైభవంగా పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించి, పితృకర్మలు నిర్వహించి పునీతులు అవుతారు.
భారతదేశ చరిత్ర, పురాణాల్లో సరస్వతి నదికి చాలా ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్న సరస్వతి నది అంతర్వాహినిగా మాత్రమే కనిపిస్తుంది. రుగ్వేదంలోనూ సరస్వతి నది గురించి ప్రస్తావన ఉంది. అంబితమే, నదీతమే, దేవీతమే, ఉత్తమ నది, ఉత్తమ దేవతగా పురాణాల్లో సరస్వతిని కీర్తించారు.
హిమాలయాల నుంచి ప్రారంభమైన సరస్వతి నది భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సరస్వతి నది యమునా, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించిందని రుగ్వేదంలో ఉంది. ప్రస్తుతం ఈ నది బయటకు ఎందుకు కనిపించదంటే..సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక, వాతావరణ మార్పుల వల్ ఈ నది తన ఆనవాళ్లను మాత్రమే మిగిల్చిందని శాస్త్రవేత్తలు అంచనా.
సరస్వతీ నది ఆరంభం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. వీటిల్లో ఒకటి పురాతనమైనది మరొకటి శాస్త్రీయమైనది. సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని పురాణాల్లో ఉంది. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల్లోని హర్-కీ-దూన్ హిమానీనదం నుంచి ఉద్భవించిందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నారు. మొదట్లో సట్లెజ్ యమునా నదులతో సంబంధం కలికి ఉండే సరస్వతి నది భూకంపాల కారణంగా మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు.
సరస్వతి నదికి పుష్కరాలు జరిగే ప్రదేశాలు ఇవే
@ సరస్వతీనది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గర్లో మానా అనే గ్రామంలో పుట్టింది. అలకనంద నదికి ఇది ఉపనది. మాన నుంచి ప్రవహిస్తూ కేశవ ప్రయాగ్ వద్ద అలకనందలో కలుస్తుంది. అందుకే సరస్వతి నది పుష్కరాలు మానా గ్రామంలో జరుగుతాయి.
@ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలోను, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లోను, గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ త్రివేణి సంగమంలోనూ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ మూడు ప్రదేశాల్లోనూ పుష్కరాలు జరుగుతాయి
@ తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో కాళేశ్వరంలో త్రివేణి సంగమంలోనూ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి
బృహస్పతి ఏ రాశిలో ప్రవేశించినప్పుడు ఏ ఏడాది ఏ నదికి పుష్కరాలు ...వివరాలు ఇదిగో...
సరస్వతీ నది -మిథున రాశి (2025)
యమునా నది- కర్కాట రాశి (2026)
గోదావరి -సింహ రాశి (2027)
కృష్ణా నది -కన్యా రాశి (2028)
కావేరీ నది -తులా రాశి (2029)
భీమా నది -వృశ్చిక రాశి (2030)
పుష్కరవాహిని -ధనుర్ రాశి (2031)
తుంగభద్ర నది -మకర రాశి (2032)
సింధు నది -కుంభ రాశి (2033)
ప్రణహిత నది -మీన రాశి (2034)
గంగానది - మేష రాశి (2035)
రేవా నది (నర్మద) -వృషభ రాశి (2036)






















