Pushpa 2 The Rule Gangamma Jatara : పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
Pushpa 2 Gangamma Jatara : పుష్ప 2 సినిమా చూసొచ్చిన ఏ ప్రేక్షకుడిని క్వశ్చన్ చేసినా...కామన్ గా చెప్పే మాట గంగమ్మ జాతర ఎపిసోడ్. ఇంతకీ గంగమ్మ జాతర ఎందుకంత స్పెషల్? మగాళ్లంతా చీరలెందుకు కడతారు?
ఇంతకీ గంగమ్మ జాతరలో లేడీ గెటప్ ఎందుకు వేస్తారు? మగవాళ్లంతా చీరలెందుకు కట్టుకుంటారు? ఆడవాళ్లంతా మగరాయుడు అయిపోతారెందుకు? చిన్నారులు మీసకట్టు పెడతారు..మరికొందరు అమ్మోరుగా, రాక్షసులుగా ఇలా చాలా గెటప్పులు కనిపిస్తాయ్ గంగమ్మ జాతరలో. గంగమ్మ జాతర జరిగే వారం పాటూ ఎక్కడచూసినా పూనకాలే అన్నట్టుంటుంది. ఇలాంటి వేషధారణలు గంగమ్మకు ఇష్టమట..అందుకే ఈ వేషధారణతో అమ్మను దర్శించుకుంటే చల్లని చూపు ప్రసరిస్తుందని, ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయని తిరుపతి గంగమ్మ భక్తుల విశ్వాసం.
Also Read: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
డిసెంబర్ నుంచి సందడి మొదలు (Tirupati Gangamma Jatara 2025)
ఏటా డిసెంబర్లో గంగమ్మ జాతర గురించి చర్చ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా డిసెంబర్లో వచ్చే రెండో ఆదివారం అర్థరాత్రి చాటింపు వేసి తేదీలు ప్రకటిస్తారు. జాతర మే నెల మొదటివారంలో జరుగుతుంది. అంటే జాతరకు నాలుగైదు నెలల ముందుగానే సందడి మొదలైపోతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా తిరుపతికి వచ్చేస్తారు. వారం పాటూ వైభవంగా జరిగే జాతరను అస్సలు మిస్సవరు. కేవలం తిరుపతి వాసులే కాదు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.
ఎవరీ గంగమ్మ ..
తిరుపతిలో కొలువుతీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్లలో గంగమ్మ ఒకరు. ఈమెను శ్రీ వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించి పూజలు చేస్తారు. అందుకే టీటీడీ తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
జాతర ఎప్పుడు?
మే నెలలో మెుదటి మంగళవారం అర్థరాత్రి కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు వేసి మొదలయ్యే జాతర వచ్చే మంగళవారంతో ముగుస్తుంది. ఈ ఏడు రోజులు ఎవరూ ఊరి పొలిమేర దాటివెళ్లరు..
లేడీ గెటప్పులెందుకు?
రాయలసీమలో పాలెగాళ్ళ రాజ్యం నడుస్తున్న రోజుల్లో మహిళలపై ఎన్న అఘాయిత్యాలు జరిగేవి. ఆ కామాంధుల బారినుంంచి తప్పించుకోలేక చాలా కష్టాలు పడ్డారు. తిరుపతి సమీపం అవిలాల గ్రామంలో కైకా వంశంలో పుట్టిన ఆడబిడ్డను దత్తత తీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి ఆమెకు గంగమ్మ అని పేరు పెట్టాడు, తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు వెంటాడింది గంగమ్మ. తనకు భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని బయటకు రప్పించేందుకు వివిధ రకాల వేషధారణతో తిరిగింది. బైరాగి, మాతంగిగా..చివరకు దొర వేషంలో వచ్చిన గంగమ్మను పోల్చుకోలేక బయటకొచ్చాడు పాలెగాడు. వాడిని సంహరించిన తర్వాత మాతంగి వేషధారణలో వెళ్లి ఆ పాలెగాడి భార్యకు ధైర్యం చెబుతుంది గంగమ్మ. అప్పటి నుంచి గంగమ్మను శక్తి స్వరూపంగా భావించి జాతర చేయడం ప్రారంభించారు.
Also Read: పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
రాక్షస సంహారం కోసమే పుష్పరాజ్ స్త్రీ వేషధారణ
రాక్షస సంహారం కోసం గంగమ్మ విచిత్ర వేషధారణలా..భక్తులు కూడా విచిత్ర వేషధారణలో అమ్మను దర్శించుకుంటారు. స్త్రీలంతా మగవారి గెటప్ లో కనిపిస్తే..పురుషులంతా చీరలు కడతారు..పుష్ప 2 లో గంగమ్మ జాతర సన్నివేశం వద్ద బన్నీ గెటప్ ఇదే. సినిమాలో ఈ సన్నివేశం మహిళను వేధించిన రాక్షస సంహారం కోసమే...
అప్పట్లో ముందుగా గంగమ్మను దర్శించుకుని తిరుమల వెళ్లేవారట..ఇప్పటికీ కొందరు ఆ సంప్రదాయం పాటిస్తున్నారు.