GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Maharastra News: మహారాష్ట్రలో జీబీఎస్ సిండ్రోమ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు. ఇప్పటివరకూ 101 జీబీఎస్ కేసులు నమోదైనట్లు సమాచారం.

GBS Syndrome Cases In Maharastra: మహారాష్ట్రలో (Maharastra) గిలైన్ బార్ సిండ్రోమ్ (GBS) కలకలం రేపుతోంది. తాజాగా.. సోలాపుర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఈ నెల 9న ఆస్పత్రిలో చేరిన రోగి పుణే క్లస్టర్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపింది. పుణెలో ఇప్పటివరకూ 101 జీబీఎస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 28 మందికి ఇన్ఫెక్షన్ ధ్రువీకరించగా.. వారిలో 16 మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిలో 19 మంది రోగుల వయసు తొమ్మిదేళ్ల కంటే తక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 50 నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న వారు 23 మంది వరకూ ఉన్నారు.
నీటి నమూనాల సేకరణ
జీబీఎస్ సిండ్రోమ్ (Guillain Barre Syndrome) వ్యాప్తితో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించగా.. అందులో క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది. రంగంలోకి దిగిన అధికారులు కేసులు అధికంగా నమోదవుతున్న పుణేలోని పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరిస్తున్నారు. పూణేలోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాసా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈకోలి అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు శనివారం విడుదలైన ల్యాబ్ టెస్ట్ ఫలితాల్లో వెల్లడైంది. అయితే, ఈ బావిని అసలు వినియోగిస్తున్నారా.? లేదా.? అనేది స్పష్టంగా తెలియరాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
లక్షణాలివే..
బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి అని తెలిపారు. ఆ రుగ్మత బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. డయేరియాకు కారణమయ్యే కాంపిలోబ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా జీబీఎస్‌కు కారణం కావొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కలుషితాహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుంది. దీని బారిన పడిన వ్యక్తుల్లో డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్‌కు రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే క్రమంలోనే జరిగే పొరపాటే కొందరిలో జీబీఎస్‌కు దారితీస్తుంది. ప్రతి వెయ్యి మందిలో ఒకరికే ఈ పరిస్థితి ఎదురవుతుంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వ్యాధి కలకలం రేపుతోన్న పుణేలో ప్రజలు మంచినీటిని బాగా మరిగించి తాగాలని, తినే ఆహారాలను కూడా వేడిపై ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
'అంటు వ్యాధి కాదు'
అయితే, జీబీఎస్ అంటువ్యాధి కాదని.. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, చికిత్సతో నయం చెయ్యొచ్చని వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో 80 శాతం మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 6 నెలల్లోనే స్వతహాగా నడవగలరని చెప్పారు. ఆదివారం నాటికి మొత్తం 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది కాగా.. మహారాష్ట్ర ప్రభుత్వం రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా జీబీఎస్ చికిత్స అందిస్తామని వెల్లడించారు.






















