SEBI New Chief: మాధబి పురి బచ్‌కు టాటా - సెబీ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం
Madhabi Puri Buch To Exit SEBI: మాధబి పురి బచ్ 3 సంవత్సరాల పాటు సెబీ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే, తన పదవీ కాలం చివరిలో ఆమె వివాదాలతో సావాసం చేశారు.

Applications Invited For New SEBI Chairman Post: భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రస్తుత చైర్‌పర్సన్ మాధబి పురి బచ్ పదవీకాలం వచ్చే నెలాఖరు (28 ఫిబ్రవరి 2025)తో ముగియనుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త చైర్మన్ కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. 2025 ఫిబ్రవరి 17 వరకు అప్లికేషన్ గడువు ఉంది.
కొత్త సెబీ ఛైర్మన్‌కు ఎంత జీతం ఇస్తారు?
ముంబైలోని 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా'లో ఛైర్మన్ పదవిని భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి భారత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (Department of Economic Affairs) జారీ చేసిన నోటీసులో పేర్కొంది. సెబీ ఛైర్మన్‌గా నియమితుడైన వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి గరిష్టంగా ఐదు సంవత్సరాల పాటు లేదా నియామకం పొందిన వ్యక్తికి 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అప్పటి వరకు ఆ పదవిలో ఉంటారు.
ఆర్థిక వ్యవహారాల విభాగం నోటీసు ప్రకారం, సెబీ కొత్త ఛైర్మన్‌కు జీతం విషయంలో రెండు ఆప్షన్‌లు ఉంటాయి. ఆప్షన్ 1 - భారత ప్రభుత్వ కార్యదర్శితో సమానమైన వేతనాన్ని పొందవచ్చు. ఆప్షన్ 2 - నెలకు రూ. 5,62,500 జీతాన్ని వేతనాన్ని ఎంచుకోవచ్చు. రెండో ఆప్షన్‌లో ఇల్లు, కారు సౌకర్యం లభించదు. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ నచ్చితే దానిని సెబీ కొత్త ఛైర్మన్ ఎంచుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఫిబ్రవరి 01లోపు ఈ పదాలు తెలుసుకోండి, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సులభంగా అర్ధమవుతుంది
మూడేళ్లు పని చేసిన మాధబి పురి బచ్
ప్రస్తుత చైర్ పర్సన్ మాధబి పురి బచ్, సెబీ చీఫ్‌గా 2022 మార్చి 02న బాధ్యతలు స్వీకరించారు. ఆమె మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28, 2025తో ముగియనుంది. ఈ కాలంలో ఆమె వివాదాలు ఎదుర్కొన్నారు. సెబీ ఛైర్మన్ కావడానికి ముందు, మాధబి పురి బచ్, 2017 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు ఐదు సంవత్సరాల పాటు సెబీ పూర్తి-కాల సభ్యురాలి (Full-time member)గా పని చేశారు.
వివాదాలతో నిండిన పదవీకాలం
సెబీ చైర్ పర్సన్‌గా మాధబి పురి బచ్ కొన్ని వివాదాల్లో కూరుకుపోయారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బచ్ రాజీనామా కోసం డిమాండ్ చేశాయి. గత సంవత్సరం, అదానీ గ్రూప్‌తో అనుసంధానమైన ఆఫ్‌షోర్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్నది మాధబి పురి బచ్ మీద వచ్చిన ఆరోపణ. రెగ్యులేటర్ కార్యాలయంలో విషపూరితమైన పని సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ సెబీ ఉద్యోగులు ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కూడా చేపట్టారు. 2023 జనవరిలో, అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా నివేదికను విడుదల చేసిన అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research), మాధబి పురి బచ్‌పైనా ఆరోపణలు చేసింది.
మరో ఆసక్తికర కథనం: మొరార్జీ దేశాయ్ - నిర్మల సీతారామన్, అత్యధిక బడ్జెట్‌ల రికార్డ్ ఎవరిది?





















