Budget 2025: మొరార్జీ దేశాయ్ - నిర్మల సీతారామన్, అత్యధిక బడ్జెట్‌ల రికార్డ్ ఎవరిది?
Morarji Desai To Nirmala Sitharaman: ఎనిమిది బడ్జెట్‌లు సమర్పించిన ప్రణబ్ ముఖర్జీ రికార్డును ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధిగమించనున్నారు.

Who Has Presented Most Budgets In India: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 01, 2025న కేంద్ర బడ్జెట్ సమర్పించనున్నారు. నిర్మలమ్మకు ఇది వరుసగా 8వ బడ్జెట్. బీజేపీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (NDA) ప్రభుత్వ మూడో పరిపాలన కాలంలో రెండో బడ్జెట్ అవుతుంది.
2019 జులైలో, భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మల సీతారామన్, అదే సంవత్సరం తన తొలి బడ్జెట్‌ను సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, 2024 ఫిబ్రవరిలో ఒక తాత్కాలిక బడ్జెట్‌తో పాటు వరుసగా ఏడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.
భారతదేశంలో ఎవరు అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు?
1959 నుంచి 1963 వరకు & మళ్ళీ 1967 నుంచి 1969 వరకు ఆర్థిక మంత్రిగా పని చేసిన మొరార్జీ దేశాయ్ (Morarji Desai), అత్యధిక బడ్జెట్‌లు సమర్పించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఆయన మొత్తం 10 బడ్జెట్‌లు సమర్పించారు, వాటిలో రెండు తాత్కాలిక బడ్జెట్‌లు ఉన్నాయి.
మొరార్జీ దేశాయ్ 1959 ఫిబ్రవరి 28న తన తొలి బడ్జెట్ సమర్పించారు. తర్వాత, రెండు సంవత్సరాల పాటు పూర్తి బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. 1962లో తాత్కాలిక బడ్జెట్, ఆ తరువాత రెండు పూర్తి స్థాయి బడ్జెట్‌లు మొరార్జీ దేశాయ్ నుంచి వెలువడ్డాయి. నాలుగు సంవత్సరాల తర్వాత, 1967లో మరో తాత్కాలిక బడ్జెట్‌ను ఆయన పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ తర్వాత 1967, 1968, 1969లలో వరుసగా మూడు సంవత్సరాలు పూర్తి స్థాయి బడ్జెట్‌లను దేశానికి అందించారు. వీటితో కలిపి మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ల రికార్డ్ 10కి చేరుకుంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం (P. Chidambaram), అత్యధిక కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రెండో వ్యక్తిగా రికార్డ్‌ల్లో పేరు లిఖించుకున్నారు. ఆయన మొత్తం తొమ్మిది బడ్జెట్‌లు సమర్పించారు. 1996లో, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో తన మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు, ఆ తర్వాత 1997లో మరొకటి ప్రవేశపెట్టారు. UPA ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2008 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను, 2013 & 2014లో మరో రెండు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. వీటితో ఆయన బడ్జెట్‌ల స్కోర్ తొమ్మిదికి చేరుకుంది.
2025 ఫిబ్రవరి 01న బడ్జెట్ సమర్పించనున్న నిర్మల సీతారామన్, మొత్తం ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) రికార్డును బద్దలు కొడతారు. ప్రణబ్ ముఖర్జీ 1980ల ప్రారంభంలో మూడు & 2009 నుంచి 2012 వరకు వరుసగా ఐదు బడ్జెట్‌లు అందించారు.
వరుసగా అత్యధిక బడ్జెట్‌ల రికార్డ్ ఎవరిది?
2025 ఫిబ్రవరి 01న ప్రవేశపెట్టే బడ్జెట్‌తో, వరుసగా ఎనిమిది కేంద్ర బడ్జెట్‌లు సమర్పించిన మొదటి వ్యక్తిగా నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టిస్తారు. క్రితం సారి, 2024 జులై 23న బడ్జెట్ (వరుసగా ఏడో బడ్జెట్) సమర్పించిన నిర్మల సీతారామన్, వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించారు.
మరో ఆసక్తికర కథనం: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!





















