Budget 2025: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
Budget 2025 Expectations: సబ్సిడీ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించవచ్చు. పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు వివిధ పథకాల లబ్ధిదార్లు బహుమతులు పొందవచ్చు.

Union Budget 2025 Expectations: ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం బడ్జెట్ ప్రకటన సమయం దగ్గరలోనే ఉంది. పెరిగిన ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న భారతీయ సమాజంలోని ప్రతి వర్గంలో, రాబోయే బడ్జెట్‌పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ధరల పెరుగుదలతో దారుణంగా దెబ్బతిన్న సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రకటనలు ఉండవచ్చు. ప్రజల చేతుల్లో నగదు చలామణీని పెంచేందుకు ప్రభుత్వ రాయితీ పథకాల (Government subsidy schemes) విషయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) పూర్తి ఉదారంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వరకు చాలా సంక్షేమ పథకాల కోసం పెద్ద ప్రకటనలు ఉండవచ్చు.
పీఎం ఆవాస్ యోజనలో సరళంగా రుణ ప్రక్రియ!
స్థిరాస్తి రంగానికి (Real estate sector) బూస్టర్ డోస్ ఇవ్వడానికి & సాధారణ ప్రజల సొంత ఇంటిని కలను నిజం చేయడానికి... కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Prime Minister Awas Yojana)లో సబ్సిడీ మొత్తాన్ని పెంచవచ్చు. అంతేకాదు, ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ప్రక్రియను మరింత సరళంగా మార్చవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రత్యేకించి, అర్బన్ హౌసింగ్ కోసం ఎక్కువ కేటాయింపులు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) కింద బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు కూడా చేయవచ్చు. దీంతో, మరిన్ని కొత్త కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రచారానికి బలం చేకూరుతుంది. ఇటీవల, 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులను ఈ పథకంలో చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు, ఈ పథకానికి కేటాయింపులను పెంచడం వల్ల కవరేజీని పెంచడం మరింత సులవవుతుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బు రూ. 12 వేలు!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) కింద, భారత ప్రభుత్వం వార్షిక వాయిదాను రూ. 6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేయవచ్చు. ఇది, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి రైతులకు సాయం చేస్తుంది, వ్యవసాయ రంగంపై అధిక ధరల ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా, రైతుకు పెట్టుబడి భారం తగ్గి & లాభం పెరుగుంది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం పచ్చగా ఉంటేనే మిగిలిన రంగాలు కళకళలాడతాయి. కాబట్టి, రైతుల చేతుల్లో డబ్బు పెరిగితే సమాజంలో నగదు ప్రవాహం పెరుగుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయాన్ని పెంచాలన్నది చాలా కాలంగా రైతుల డిమాండ్. రైతులకు అతి తక్కవ వడ్డీ రేట్లకు బ్యాంక్ రుణాలు & తక్కువ పన్నులపైనా ఆర్థిక మంత్రి నుంచి ప్రకటనలు రావచ్చు.
ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (Pradhan Mantri Gram Sadak Yojana) బడ్జెట్‌ను 10 శాతం పెంచవచ్చు. గతేడాది దీని కోసం రూ. 14,800 కోట్ల నిధిని పక్కనబెట్టారు. MSME రంగానికి ప్రభుత్వం తక్కువ వడ్డీకి ఎక్కువ క్రెడిట్ గ్యారెంటీని, రుణాలను కూడా ప్రకటించవచ్చని తెలుస్తోంది.
మరో ఆసక్తికర కథనం: రూ.1,700 తగ్గిన పసిడి, రూ.1,000 తగ్గిన వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ





















