Bobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP Desam
చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా...బొబ్బిలి యుద్ధానిది ఓ ప్రత్యేకత.
1757 లో జనవరి 24 న జరిగిన యుద్ధం గురించి ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు స్థానికులు. ఈ నెలతో బొబ్బిలి యుద్ధానికి 268 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ చరిత్ర కళ్ల ముందే జరిగినట్లుగా చెబుతారు చరిత్రకారులు..
ఒకవైపు వందలాదిమంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం... మరోవైపు వేలాదిమంది సైన్యంతో విజయనగరం సంస్థానం...పూసపాటి రాజులకు మద్దతుగా ఫ్రెంచ్ సైన్యం. తాండ్రపాపారాయుడి ధీరత్వానికి నిదర్శనం బొబ్బిలి యుద్ధం. ఒక్కరోజులోనే ముగిసిపోయిన ఈ యుద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నాటి ఆయుధాలు, కత్తులు, బళ్లాలకు బొబ్బిలి సంస్థానం ప్రత్యేక భద్రత కల్పిస్తూ ప్రదర్శనకూ ఉంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
ఏటా బొబ్బిలి యుద్ధానికి గుర్తుగా కట్టిన స్థూపం వద్ద రాజవంశీయులు పూజలు నిర్వహిస్తారు. ఎమ్మెల్యే బేబి నాయన ఈ ఏడాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద పూలమాల వేసి అప్పటి యుద్ధంలో తనువు చాలించిన సైనికులు వీరోచితాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన యుద్దంలో తాండ్ర పాపారాయుడు పోరాట పటిమ ఉమ్మడి శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా నాడు ఉద్యమ స్ఫూర్తికి కారణమైంది.





















