Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
Jagan cases: జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు పర్యవేక్షణలో కేసుల రోజువారీ విచారణ జరగాలని ఆదేశించింది.

Supreme Court has issued important orders in Jagan illegal assets cases: జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ సుదీర్ఘంగా సాగుతోందని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని .. ట్రయల్ కోర్టు... రోజు వారీ విచారణకు తీసుకోవాలని ఆదేశించంది. హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని సూచించింది. హైకోర్టు పర్యవేక్షణలో ట్రయల్ జరుగుతుంది కాబట్టి మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తెలిపింది. బెయిల్ రద్దు పిటిషన్‌నను కూడా ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు రఘురామకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని ధర్మాసనం చెప్పడంతో రఘురామ తరపు న్యాయవాది ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరారు. దీనికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను ప్రత్యేక కోర్టులు రోజు వారీగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని కోర్టుకు జగన్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం ఎదుట వాదించారు. అయితే రోజువారీ విచారణ జరగడం లేదని శుక్ర, శనివారాల్లో తీసుకుంటున్నారని గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారానికి నోచుకోలేదని రఘురామ న్యాయవాది వాదించారు.
డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న రఘురామ తరపు లాయర్
పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటు అయ్యిందని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని రఘురామ తరపు న్యాయవాది వాదించారు. డిశ్చార్జ్ పిటిషన్‌ల విషయంలో ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత కూడా తీర్పు రాకుండానే జడ్జీలు ఆరు సార్లు బదిలీ అయ్యారన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు కూడా పర్యవేక్షణ చేస్తున్నందున ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం లేదన్నారు.
సుప్రీంకోర్టు నిర్ణయంతో జగన్ కు ఊరట
రఘురామ వేసిన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు జగన్ కు ఊరట కలిగించిందని అనుకోవచ్చు. వేరే రాష్ట్రానికి బదిలీ చేసినా.. బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరిగినా జగన్ కు సమస్యలు వచ్చేవి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే ఈ కేసుకు కూడా వర్తిస్తాయని చెప్పడంతో ఇప్పుడు ట్రయల్ కోర్టు రోజువారీ విచారణపై నిర్ణయం తీసుకోనునంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

