Makar Sankranti 2024: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు!
తెలుగువారికి సంక్రాంతి చాలా ప్రత్యేకం. దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి ఉంటుంది. సూర్యుడు దిశను మారే ఈ సమయంలో పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాలివే..
Makar Sankranti 2024: భోగి మంటలు, రంగు ముగ్గులు, గొబ్బిళ్లు, భోగిపళ్లు, పిండివంటలు, కోడి పందాలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్ల సందడి, ఇళ్లంతా బంధువులు, ఇరుగుపొరుగుల పలకరింపులు..అబ్బో సంక్రాంతి గురించి చెప్పుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంది. ఆ మూడు రోజుల సంబరం సరే..మరి మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఈ సంక్రాంతి రోజు కొన్ని ఫాలో అవ్వాలి. చిన్న చిన్న పనులే కానీ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటున్నారు పండితులు..
సంక్రాంతికి నదీస్నానం
సంక్రాంతి సమయంలో గలగలపారే నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ, తమకు సమీపంలో ఉన్న నదుల్లో కానీ స్నానమాచరిస్తారు. ఇదివరకే నదీ స్నానానికి వెళ్లినప్పుడు తీసుకొచ్చిన నీటిని ఇంట్లో స్నానమాచరించే నీటిలో కలుపుకుని నదిలో స్నానం ఆచరించినట్టు భావించేవారూ ఉన్నారు. ఇలా చేసినా నదీ స్నాన ఫలితం దక్కుతుంది.
స్నానం సమయంలో చదవాల్సిన శ్లోకం
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురు//
Also Read: మకర సంక్రాంతి ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగులు నింపుతోంది, జనవరి 15 రాశిఫలాలు
సూర్యుడికి నమస్కరించండి
నగరాల్లో ఉరకల పరుగల జీవితంలో రాత్రి పగలుకి తేడా లేకుండా గడిపేస్తారు. ఎప్పుడు నిద్రపోతున్నామో, ఎప్పుడు లేస్తున్నారో కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కేవసం కాసుల వేట అంతే. కొందరైతే సూర్యోదయం చూసి ఎన్నిరోజులైందో అనుకుంటారు. ఏ అర్థరాత్రికో వచ్చి నిద్రపోయి పొద్దెక్కాక లేచి ఆఫీసులకు వెళ్లిపోతారు. ఇలాంటి వారంతా సంక్రాంతి సెలవులకు ఊరెళ్లినప్పుడు సూర్యోదయాన్ని ఆస్వాదించండి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకూ జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం.
సూర్యుడి ప్రార్థన
ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర |
దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే//
Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!
దానం ప్రధానం
ఈ రోజు దానాల్లో ముఖ్యంగా నల్లనువ్వులు అత్యంత ముఖ్యం అని గుర్తుంచుకోండి. నువ్వులు దానం చేయడం ద్వారా శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. గ్రహదోషాలు తొలగి ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. ఇంటింటా సందడి చేసే బసవన్నకి ఆహారం అందించండి. మీకు సమీపంలో ఉన్న గోశాలకు వెళ్లి పశువులకు ఆహారం, నీరు అందించండి.
పిండి వంటలు ఇచ్చి పుచ్చుకోండి
సంక్రాంతికి పది రోజుల ముందు నుంచీ పిండివంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. శని రూపంగా చెప్పే నువ్వులను పండుగ రోజు తినడం ఏంటి అనుకుంటారు కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను ప్రత్యేకంగా సంక్రాంతికి ఆస్వాదిస్తారు. లడ్డు, ఖిచ్డి తయారు చేసి అందరకీ పంచుతారు.
Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!
పేదలకు అన్నదానం,వస్త్రదానం చేయండి
పండుగ అంటేనే అందరి ఆనందం. అందుకే సంక్రాంతి రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. పండుగ రోజు ఇంటి నిండా తిండి పదార్థాలే ఉంటాయి. కానీ చాలామంది గుప్పెడు మెతుకులు కూడా దొరక్క ఆకలితో అలమటించేవారున్నారని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు భోజనం చేసిన తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి. ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి. దేవుడు ఎక్కడో ఉండడు..మనం చేసే సాయం లోనూ, ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనే ఉంటాడంటారు కదా. అందుకే పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు.. పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండుగ ఏముంది.
Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!