![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Makar Sankranti 2024: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!
Makar Sankranti 2024: సూర్యుడు ఓ రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయాన్ని సంక్రమణం అంటారు. మరి ధనస్సు రాశి నుంచి మకరంలో అడుగుపెట్టినప్పుడే ఎందుకు ప్రత్యేకం. అప్పుడే సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..
![Makar Sankranti 2024: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది! Makar Sankranti 2024 Significance and importance of Sankranti All You Need To Know About The 3-Day Festivities Makar Sankranti 2024: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/02078287bd96f7086d9e3b7adb35c7151704130935179217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Significance Of Makar Sankranti 2024 : నెలకో రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అనే అంటారు. కానీ ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండుగ జరుపుకుంటారు. మూడు రోజుల పాటూ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే..అప్పటివరకూ దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకూ ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకుంటాయి. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు.
Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!
సంక్రాంతినే పెద్ద పండుగ అంటారెందుకు
సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటూ రైతులు మనసు నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు..ఎందుకంటే.. కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు(సకినాలు) చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్టు ఉంటుంది.. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. అందుకే పొంగల్ అని పిలుస్తారు. మరోవైపు పంటని చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి, ప్రకృతిని, పశువులను పూజిస్తారు
సంక్రాంతి నువ్వుల ప్రత్యేకత ఏంటి
సంక్రాంతి రోజు చేసే పిండివంటలన్నింటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండివంటలు చేసి పంచుకుంటారు. కొందరు నువ్వులను శనికి రూపంగా భావిస్తారు కానీ..చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు. నువ్వులు వాడకం వెనుక ఆరోగ్యరహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధికపోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది. అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులని తినడం వల్ల, మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్టవుతుంది.
Also Read: ఆదిత్య మంగళ రాజయోగం, ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్స్!
సంక్రాంతి పితృదేవతల పండుగ కూడా
సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవటం తరతరాలుగా ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగగా మాత్రమే కాదు పెద్దల పండుగ కూడా.
నేను కాదు మనం అనే భావన
ఎప్పుడూ నేనే అనే భావన కన్నా..నలుగురిలో మనం అనే భావన అంతులేని ఆనందాన్నిస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ. పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెబుతారు. హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులనాడించేవారు..ఇలా పండుగ శోభను పెంచేవారెందరో. వీళ్లందరికీ తోచిన సహాయం చేసి ఆ భగవంతుడికే సహాయం చేసినట్టు భావిస్తారు.
Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!
ప్రతి చర్యా అద్భుతమే
సృజనాత్మకతని వెలికితీసే ముగ్గులు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, గొబ్బిళ్లు...ఇలా సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్దతి అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెలరోజుల ముందు నుంచీ సందడి మొదలైపోతుంది. అలాంటప్పుడు సంక్రాంతి పెద్ద పండుగ కాక మరేంటి...
2024 లో సంక్రాంతి తేదీలివే
జనవరి 14 ఆదివారం భోగి
జనవరి 15 సోమవారం సంక్రాంతి
జనవరి 16 మంగళవారం కనుమ
జనవరి 17 బుధవారం ముక్కనుమ
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)