Krishna Janmashtami 2022: కన్నయ్య మధురకే కాదు ప్రేమ మాధుర్యానికీ అధిపతి, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీ కృష్ణుడు
Krishna Janmashtami 2022: పుట్టింది రాజుకే అయినా గోకులంలో సాధారణ గోవుల కాపరిలానే పెరిగాడు కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం.
Krishna Janmashtami 2022
మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం. యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ..తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. కన్నయ్య రూపం నల్లనిదైనా ఆయన మనసు వెన్నపూసంత తెల్లనిది. దేనికీభయపడని వ్యక్తిత్వం, నమ్మిన వారికి కొండంత అండనిచ్చే మనస్తత్వం. హిందూ పురాణాల్ను, తాత్త్విక గ్రంథాల్ను, జనబాహుళ్యంలో ఉన్న కథల్లో, సాహిత్యంలో, పూజా సాంప్రదాయాల్లో కృష్ణుడి గురించి ఎన్నో విధాలుగా చెప్పుకుంటారు. చిలిపి కృష్ణుడిగా, పశువులకాపరిగా, రాధా గోపికా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగా, గోపికల మనసు దొచుకున్నవాడిగా, యాదవరాజుగా, పాండవ పక్షపాతిగా, భగవద్గీతా ప్రబోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, చారిత్రిక రాజనీతిజ్ఞునిగా ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించారు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి...వాటిలో కొన్ని...
జ్ఞానానికి సంకేతం వెన్న
శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఇష్టంగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండల్లో ఉండేది. అంటే అజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.
Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
కృష్ణతత్వం తెలిస్తే ప్రేమతత్వం తెలిసినట్టే
కృష్ణ తత్వం గురించి తెలిసిన వారికి నిజమైన ప్రేమ తత్వం అంటే ఏంటో తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషంగా మాట్లాడినట్లు లేదు. రుక్మిణి దేవి ఆరాధనను, సత్యభామ గడసరి తనం అన్నంటినీ స్వీకరించాడు. ప్రజల దృష్టిలో వీరుడు, ధీరుడు, మహా దేవుడు అయినా ఏ ప్రత్యేకతా లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండడం పరమాత్మకే చెల్లింది.
కాలానికి ప్రతీకగా నెమలి ఫించం
నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లని వర్ణంతో ప్రకాశిస్తుంది. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడని చెబుతారు.
వేణుమాధవుడు
వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపడ్డారు.కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. వాళ్ళంతా కలిసి వేణువుని అడిగితే ఇలా అందట... ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే.
Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి
కృష్ణమేఘం
ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయ మర్థనం చేస్తున్నప్పుడు, కంసచాణూరాది రాక్షసుల్ని వధిస్తున్నప్పుడూ, అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ..ఇలా సందర్భం ఏదైనా కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ...‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట!
అందుకే మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి.