Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
శ్రీకృష్ణ ఆలయాల్లో నాలుగింటిని ప్రధానంగా చెప్పుకుంటాం. ఉత్తరప్రదేశ్-మథుర, గుజరాత్-ద్వారక, కేరళ- గురువాయూరు, కర్ణాటక-ఉడిపి. వీటిలో స్వయంగా రుక్మిణి విశ్వకర్మతో తయారుచేయించిన విగ్రహం కొలువైన ఆలయం ఏదంటే
![Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా! Krishna Janmashtami 2022: Udupi sri Krishna Idol Facts, Rukmini wanted to see how Sri Krishna was as a child, do you know what she did! Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/7f0bbfcab03f34afb576ca859bb784a81660554453510217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Janmashtami 2022
ఉడిపిలో శ్రీకృష్ణుడు బాలుడిగా కొలువై ఉంటాడు. దీనివెనుక ఆసక్తికర కథనం ఉందని మీకు తెలుసా...
ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా అటుగా వస్తున్న ఓ నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో మధ్వాచార్యులు తన కండువా విసిరి ఆ నావను ఒడ్డుకి చేర్చారు. నావలోని వారంతా కిందకు దిగి స్వామివారికి నమస్కరించి తమకు కాపాడినందుకు కృతజ్ఞతగా నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు. అందుకు చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు ఇవ్వమని అడిగారు. ఆ మాటవిని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకూ పనికిరాని మట్టిగడ్డలు అడుగుతున్నారెందుకని ప్రశ్నించారు. అప్పుడు వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టంతా కరిగి లోపల నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు బయటపడ్డాయి.
Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి
ఈ విగ్రహాల ప్రాముఖ్యత ఏంటంటే
ఒకసారి దేవకీదేవి కృష్ణునితో నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టు తనకూ కలిగేలా చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలసి ఆడుకున్నాడు. బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకితో పాటూ రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణి దేవి వెంటనే విశ్వకర్మను పిలిచి..ఆడుకుంటున్న బలరామకృష్ణులను చూపించి విగ్రహాలు తయారుచేయాలని కోరింది. అలా తయారు చేయించిన విగ్రహాలు కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో కలిసినప్పుడు నీటిలో కలసిపోయాయి. ఆ తర్వాత ఇలా మధ్వాచార్యుల చేతికి వచ్చాయి. ప్రస్తుతం ఉడిపి పూజలందుకుంటున్నది ఈ విగ్రహమే..
మధ్వాచార్యులకు ముందే తెలుసుట
ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే మధ్వాచార్యులు ఆరోజు తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తన శిష్యులతో ప్రక్షాళన చేయించి … తానే స్వయంగా అభిషేకించారు. అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం… మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత 30 మంది కలిసినా కనీసం కదపలేకపోయారు. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో ఉడిపిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
పశ్చిమాభిముఖంగా బాలకృష్ణుడు
ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో మారుమోగే ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒకప్పడు శ్రీకృష్ణమఠంగా,ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలిచే ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం అని చెబుతారు. నిమ్న కులస్థుడైన కనకదాసు భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చినట్టు స్థలపురాణం. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది.
గర్భాలయ దర్శనం ఉండదు
శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, కొయ్యశిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం, దానికి సమీపంలో తీర్థ మండపం ఉంది. ఈ ఆలయంలో భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు.
Also Read: పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు
కృష్ణతత్వ వ్యాప్తికి 8 పీఠాలు
కృష్ణ పరమాత్మ భక్తుడైన మధ్వాచార్యులు కృష్ణతత్వ వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేశారు. ఈ దేవాలయ ప్రాంగణంలో తన ఎనిమిది మంది శిష్యుల కోసం 8 పీఠాలను ఏర్పాటు చేశారు. పిజ్జావారు, కుటికి, పాలిమర్, క్రిష్ణపుర , సిరూర్కానీ, ఎవరుసోదే, ఆడవారు, అనే ఎనిమిది మఠాలను మధ్వాచార్యులు ఏర్పాటు చేశారు వీటిని అష్ట పీఠాలు అని అంటారు. దేవాలయం బాధ్యతలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో పీఠం చూసుకుంటుంది. కృష్ణ తత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతున్న ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువుదీరి ఉన్నాడని భక్తుల నమ్మకం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)