Hanuman: జెండాపై కపిరాజు( హనుమంతుడు)ని ఎందుకు పెడతారు, ఇంటిపై ఆ జెండా పెడితే ఏమవుతుంది
ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరకీ తెలుసు కానీ మహాభారతంలోన మారుతి పాత్ర ఉందని..జెండపై కపిరాజు అనే మాట అప్పటినుంచే వచ్చిందని తెలుసా..
మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. ఓసారి భీముడి గర్వభంగం జరిగిన సందర్భం, మరోసారి కురుక్షేత్ర యుద్దంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలని భీముడిని కోరుతుంది. వీటిని తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డుతప్పుకోమని కోరతాడు. తాను ముసలివాడిని అని తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్లు అంటూ భీముడికి చెబుతాడు. అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదిస్తాడు.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
ఆ తర్వాత మరో సందర్భంలో కోతిరూపంలోనే అర్జునుడిని కలుస్తాడు ఆంజనేయుడు. త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారధి చూసి దీని నిర్మాణానికి కోతులసహాయం ఎందుకు నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలుమోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు. ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలి అనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు.
Also Read:శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
కురుక్షేత్రం యుద్ధం ప్రారంభ నుంచి చివరి వరకూ అర్జునుని రథ జెండాపై ఉంటాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకూ జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు" ఇప్పటి వరకూ నీ రథంపై హనుమంతుడు ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవీ ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యేదని" చెబుతాడు.
అందుకే జెండపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దుష్టశక్తులు దరిచేరవని,విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ఏదేమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం మొదలైందని చెబుతారు.
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు