Lucky Name: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!
పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా? పేరులో అక్షరాల సంఖ్య పెంచినా తగ్గించినా భవిష్యత్ వెలిగిపోతుందా? అసలు పేరెందుకు పెడతారు? ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి?....
New Name Improve Your Fortunes?: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదని.. ఆకాశ్ జగన్నాథ్ అని ప్రకటించాడు. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆకాశ్ ‘చిరుత’, ‘బుజ్జిగాడు’ మూవీస్ లో బాలనటుడిగా కనిపించాడు. ఆంధ్రాపోరీ మూవీతో హీరోగా మారాడు...‘మెహబూబా’, ‘రొమాంటిక్’, ‘చోర్ బజార్’ లో హీరోగా మెరిసాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇంతకీ... పేరు మార్చుకోవడం వెనుకున్న కారణం ఆకాష్ పూరీ చెప్పలేదు కానీ...పేరు మార్చుకున్న సందర్భంగా కెరీర్ పరంగా నూతన అవకాశాలు, విజయాలు అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Also Read: ఏదైనా పనిపై ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేయండి సక్సెస్ మీ సొంతం అవుతుంది!
నిజంగా లక్ కోసమే పేరు మార్చుకుంటున్నాం అని ఎవరూ చెప్పలేదు కానీ ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు , సామాన్యులు కూడా పేరు మార్చుకున్నారు. ఇంతకీ పేరు మార్చుకుంటే లక్ కలిసొస్తుందా? పురాణాల్లో దీనికి సంబంధించి ఏముంది?
శిశువుకి నామకరణం చేసేసమయంలో చెప్పే మంత్రం ఇది...
మమ శిశోశ్ఛ ... లోక ఉవాచితార్థం ఉవాచిత ఉత్తర క్షణ మోక్షసాధనార్థం
అంటే...లోకంలో ఉన్నవారు పిలవడానికి...ఆ నామస్మరణతో మోక్షం కలిగించేందుకు మాత్రమే పేరు పెడతారు. దేవుడి పేరు పెట్టడం వెనుకున్న ఆంతర్యం కూడా అదే.
పేరుకు అంత ప్రాముఖ్యత ఎందుకు మరి?
దీనిపై వివరణ ఇస్తూ..భాగవతంలో అజామిళోపాఖ్యానం అనే వృత్తాంతం ఉంది.
కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. తను పూర్వజన్మలో చేసిన సత్కర్మలు వల్ల బ్రాహ్మణుడిగా పుట్టాడు. ధర్మమార్గంలో నడుస్తూ వేదాలు, శాస్త్రాలు చదివాడు. గురువులకు, అతిథులకూ, పెద్దలకు సేవ చేసేవాడు. ఓ రోజు తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పూలు, పండ్లు తీసుకొచ్చేందుకు తోటకు వెళ్లి తిరిగివస్తుండగా ... పొదల్లో ఓ జంటను చూశాడు. కామోన్మత్తుడైన అజామిళుడి మనసు పట్టుతప్పింది. వెలయాలి అందానికి మనసు పట్టుతప్పింది. వైదిక కర్మలు విడిచిపెట్టి...ఇంటివద్దనున్న సౌందర్యవతి అయిన భార్యను విడిచిపెట్టి ఆ వెలయాలితోనే ఉండిపోయాడు. ఆమెతో పది మంది కొడుకులను కన్నాడు. వారిలో చివరి వాడు నారాయణుడు. వయసు పైబడిన తర్వాత అవయవాలు పట్టుతప్పాయి, చూపు సన్నగిల్లింది, అనారోగ్యం పాలయ్యాడు. ముసలితనం ముంచుకొచ్చింది. చిన్న కొడుకంటే అమితమైన ప్రేమ.. నారాయణుడు పక్కనలేకుంటే ఒక్కక్షణం కూడా ఉండలేని పరిస్థితి. మరణం సమీపించింది. పాపాత్ముడైన అజామిళుడిని తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు. వారిని చూసి భయంతో నారాయణ నారాయణ అని కొడుకుని పిలిచాడు. అలా మరణ సమయంలో నారాయణ మంత్రం జపించడంతో యమభటులు వెనక్కుతగ్గారు..విష్ణు భటులు ప్రవేశించారు. గతజన్మలో చేసిన పుణ్యకార్యాలవల్ల బ్రాహ్మణుడిగా జన్మించాడు...కానీ...ఈ జన్మలో కులాచారాన్ని వదిలిపెట్టాడు, వెలయాలితో కాపురం చేశాడు అందుకే ఈ పాపాత్ముడిని తీసుకెళ్తామన్నారు. వేదం నారాయణ స్వరూపం అని చెప్పారు. సకల ప్రాణుల్లో నారాయణుడు నిండి ఉన్నాడంటారు...అలాంటి నారాయణుడిని స్మరించాడు...అందుకే విష్ణులోకానికి తీసుకెళతామని చెప్పారు విష్ణు భక్తులు. నారాయణ అంటే కుమారుడిని పిలిచినట్టు కాదు..భగవంతుడి పేరును ఎలా ఉచ్ఛరించినా వాసుదేవుడు రక్షకుడిగా ఉంటాడు..అలాంటి వారికి యమబాధలు ఉండవని చెప్పారు.
Also Read: నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!
- పిల్లలకు భగవంతుడి పేరు పెట్టడం వెనుకున్న ఆంతర్యం ఇదే...
- పడిపోయే శరీరానికి పేరు అవసరం లేదు
- శాశ్వతంగా ఉండే ఆత్మకు పేరుతో పనిలేదు
- జీవుడు భూమ్మీద ఉన్నంతకాలం పిలిచేందుకు మాత్రమే పేరు
అందులో అక్షరాలు మార్చినంత మాత్రాన, పేరు మార్చుకున్నంతమాత్రాన అదృష్టం కలిసొస్తుందని, జీవితంలో ఊహించని మార్పులు వచ్చేస్తాయన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి, మీరు చేసే మంచిపనులే మీ భవిష్యత్ ను నిర్ణయిస్తాయంటున్నారు వేద పండితులు.
Also Read: శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ పూలతో పూజచేస్తే సిరిసంపదలు నిలుస్తాయి!