Sree Mahalakshmi: శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ పూలతో పూజచేస్తే సిరిసంపదలు నిలుస్తాయి!
Spirituality : వారంలో రోజుకో దేవుడిని ఆరాధిస్తారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారంతా. ప్రతివారం లక్ష్మీపూజ చేసేవారు ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సిరిసంపదలు నిలుస్తాయంటారు పండితులు
శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం . అయితే ఈ కోర్కెలు నెరవేరాలంటే శ్రీ మహాలక్ష్మిని ఎరుపురంగు పూలతో పూజించాలని చెబుతున్నారు పండితులు. ఎరుపు రంగులో ఉండే మందారం, గులాబీ, కలువ పూలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే ఎర్రటి పూలతో అమ్మను పూజిస్తే అనుగ్రహానికి తొందరగా పాత్రులవుతారని అంటారు. మందారపూల మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువైందని నమ్మేవారూ ఉన్నారు. ఈ ఎర్రటి పూలతో పాటూ గన్నేరు పూలను కూడా అమ్మవారి పూజకు వినియోగించవచ్చు. గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలకు లోటుండదని భావిస్తారు, ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా విశ్వసిస్తారు. ఎరుపు లేదా పసుపు గన్నేరపూలతో పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేపట్టిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వఘ్నంగా పూర్తవుతాయి. వీటితో పాటూ బంతి, చామంతి లాంటి పసుపు రంగు పూలు పూజకు వినియోగించవచ్చు. అయితే పూజ చేసేముందు పూలను తడపకూడదు.
Also Read: శ్రావణమాసంలో ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం - సెప్టెంబరు 03 వరకూ మీకు తిరుగులేదు!
పూజలో ఇవి కూడా ఉంచండి
ఎర్రటి, పచ్చటి పూలతో పాటూ అమ్మవారి పూజలో శంఖం, గవ్వలు, శ్రీఫలం పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీఫలాన్ని నిత్యం పూజించే వారింట ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శ్రీ ఫలాన్ని వ్యాపార స్థలంలో అయినా, కార్యాలయంలో అయినా పెడితే ఆర్థికాభివృద్ధి ఉంటుంది. శ్రీ ఫలాన్ని నిత్యం పూజించే వారి చేతులమీద వృధాఖర్చు అవదు. వ్యవసాయం చేసేవారు క్షేత్రంలో శ్రీ ఫలాన్ని ఉంచితే పంటలు బాగా పండుతాయని చెబుతారు. అయితే శ్రీ ఫలంతో ఎప్పుడూ నాణేలు కూడా ఉంచాలి.
Also Read: మీ సమస్య ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి..దానివల్ల వచ్చే ఫలితమేంటి!
ఇలాంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదు
ఇంట్లో లక్ష్మీదేవిని కొలువుతీర్చేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించాలి. కానీ చిన్న పొరపాటు చేసినా అమ్మవారు అంతర్థానమైపోతుంది. అసూయ, ద్వేషాలు ప్రదర్శించినా, నిత్యం కలహాలు జరిగే ఇంట...ధర్మం తప్పిన చోట, తులసిని పూజించని ప్రదేశంలో, నిత్యం దీపారాధన లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అతిథి సత్కారాలు లేని ఇంట్లో అమ్మవారు అరక్షణం కూడా నిలువదు. భగవంతుడిని నిందించేవారి ఇంట, అసత్యాలు చెప్పినా, దుర్భాషలాడినా వారి ఇంట సిరిసంపదలు ఉండవు. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం సమయంలో నిద్రపోయేవారింట కూడా శ్రీ మహాలక్ష్మి నిలవదు. సోమరుల ఇంటివైపు అమ్మవారు కన్నెత్తి కూడా చూడదు.
Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!
శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రం
ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే
విష్ణు పత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ||