Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!
Christmas 2023: క్రిస్మస్ ట్రీ అలంకరణతోనే పండుగ సందడి ప్రారంభమవుతుంది. ఈ అలంకరణలో ముఖ్యంగా నాలుగు రంగులు వినియోగిస్తారు.. అవేంటి..ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం...
Christmas Celebrations 2023: క్రిస్మస్ సందడి మొదలైంది. ఈ వేడుకల్లో భాగంగా చర్చిలు, ఇళ్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం మొదలుపెట్టారు. ప్రార్థనలు చేయడం, కొత్తబట్టలు ధరించడం, శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ అలంకరణ...ఇవన్నీ వేడుకల్లో ప్రత్యేకం. సందడి మొదలయ్యేది మాత్రం ట్రీ అలంకరణతోనే. ఇందులో నాలుగు రంగులు వినియోగిస్తారు. అవి ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, బంగారం రంగు. అన్నిరంగులు ఉండగా ఈ నాలుగు రంగులే ఎందుకు స్పషలో తెలుసా...
తెలుపు రంగు
శాంతి స్వచ్ఛతకు చిహ్నం తెలుపురంగు. శీతాకాలంలో కురుస్తున్న మంచును కూడా సూచిస్తుంది. అందుకే క్రిస్మస్ ట్రీ అలంకరణలో తెలుపు రంగు బదులు..పత్తిని ఉపయోగిస్తారు. విశ్వాసం, జీవితంలో ప్రకాశానికి కూడా తెలుపు సూచన
Also Read: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!
ఎరుపు రంగు
క్రిస్మస్ వేడుకల్లో ఎరుపు రంగు చాలా చాలా ప్రత్యేకం. ఇది బిషప్, శాంతా క్లాజ్ దుస్తుల రంగు. ఇది యేసు రక్తాన్ని , తన త్యాగాన్ని సూచించే రంగుగా విశ్వసిస్తారు. రెడ్ కలర్..ఇతరులపట్ల ప్రేమకు చిహ్నం. ప్రేమ ఉన్నచోట ఆనందం ఉంటుంది. అందుకే క్రిస్మస్ ట్రీ అలంకరణలో ఈ రంగుని వినియోగిస్తారు.
ఆకుపచ్చ రంగు
ఏసుక్రీస్తు శిలువవేసినప్పటి నుంచీ ప్రజల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడని విశ్వసిస్తారు. అందుకు చిహ్నంగా ఆకుపచ్చ అని భావిస్తారు. ఈ రంగు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. శీతాకాలంలో కూడా మొక్కలు తమ రంగును కోల్పోవు కాబట్టి, రోమన్లు ఈ రంగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే క్రిస్మస్ అలంకరణల్లో ఆకుపచ్చ రంగు ప్రత్యేకం
బంగారం రంగు
దేవుడు ప్రపంచానికి ఇచ్చిన బహుమతికి సూచనగా బంగారం రంగుని భావిస్తారు. ఈ రంగును ఉపయోగించడం వెనుకున్న ఆంతర్యం ఆనందాన్ని పంచుకోవడం. బంగారు రంగు సంపదకు చిహ్నంగా భావిస్తారు...అందుకే అదృష్టాన్ని ఆకర్షించేందుకు ఇంటి అలంకరణలో ఈ రంగుని ఉపయోగిస్తారు.
Also Read: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
క్రిస్మస్ ట్రీ ఎందుకు అలంకరిస్తారు!
క్రిస్మస్ ట్రీ అలంకరణ వెనుకు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పిల్లాడి వద్ద డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక తన ఇంటిముందు అందమైన మొక్కను తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళతాడు. అక్కడున్నవారంతా విలువైన కానుకలతో వస్తారు. అక్కడున్న వాళ్లంతా ప్లాబో తెచ్చిన పూలకుండీ చూసి ఎగతాళి చేస్తారు. దీంతో ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ వద్ద పెడతాడు. ఆ మొక్క అప్పటికప్పుడు పెద్ద బంగారు వృక్షంలా మారిపోతుంది. దీంతో ఆ పేద బాలుడి తెచ్చిన కానుకే అందరి కంటే విలువైనది అవుతుంది. అప్పటి వరకు ఆ బాలుడిని ఎగతాళి చేసిన వారంతా తలదించుకుంటారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకల్లో ట్రీ భాగమైపోయిందని చెబుతారు.
Also Read: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
అయితే క్రిస్మస్ ని ఓ మతపరమైన పండుగగా కాకుండా ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకునే వేడుకగా చూస్తే అందరూ జరుపుకోవచ్చు. ఇంటి అలంకరణ పాజిటివ్ వైబ్రేషన్స్ ని, ప్రశాంతతని ఇస్తుంది..అందుకే క్రైస్తవులు మాత్రమే కాదు ట్రీ అలంకరణ ఆసక్తి ఉన్నవారు ఎవ్వరైనా చేసుకోవచ్చు.