Khammam BRS Meeting : ఖమ్మం గర్జన సభ తర్వాత కేసీఆర్ ఇమేజ్ పెరుగుతుందా ? ప్రధాని అభ్యర్థిగా అంగీకారం లభిస్తుందా?
ఖమ్మం సభ తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్ ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తాయా ? ఈ విషయంలో బీఆర్ఎస్ నేతల అంచనాలేమిటి ?
Khammam BRS Meeting : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ జీవితంలో గర్జనలది కీలక పాత్ర. తెలంగాణ కోసం ఉద్యమించాలనుకున్నప్పుడు ఆయన మొదటి గర్జన పెట్టారు. తన పోరాటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే పద్దతిలో జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి భారత సింహ గర్జనతో ఖమ్మం నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ తరహాలో సక్సెస్ అవుతారో లేదో కాలం నిర్ణయిస్తుంది కానీ.. దేశాన్ని ఆకర్షించే బహిరంగసభలు నిర్వహించడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందుంటారు.
గర్జన సభలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కేసీఆర్
భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో కేసీఆర్ ది అందే వేసిన చేయి. తెలంగాణ ఉద్యమానికి ఊపు బహిరంగసభల ద్వారానే వచ్చింది. ఇదే స్ఫూర్తితో టీ-ఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధం య్య్యారు. 2001లో కరీంనగర్ సింహగర్జన మొదలు 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహా గర్జన వరకు విజయవంతమైన అనేక బహిరంగ సభలు కేసీఆర్ ఉద్యమ స్పూర్తిని రెట్టింపు చేశాయి. టీ-ఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక ఖమ్మం గడ్డపై బుధవారం నిర్వహించే బహిరంగ సభను దేశం ఆకర్షించే విధంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి కేసీఆర్ బీఆర్‌ఎస్ శంఖారావం పూరించను న్నారు.
2001లో టీఆర్ఎస్ పెట్టిన కొద్ది రోజులకే కరీంనగర్‌లో గర్జన
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన కొద్ది రోజులకే 2001 ఏప్రిల్ 27న కరీంనగర్‌లో పార్టీ ఆవిర్భావ సభ, ఆ తర్వాత హన్మకొండలో నిర్వహించిన మరో బహిరంగ సభ ఉద్యమ వేడి పెంచింది. అది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయం. ఎన్నికల్లో విజయాలు సాధించి తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షను వెలుగెత్తి చాటారు. అలాగే 2003లో వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభ తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా చేసిందని చెబుతారు. వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డి పేటలో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన బహిరంగసభ రికార్డు సృష్టించింది.
టీఆర్ఎస్ ఆవిర్భావం.. బీఆర్ఎస్ ఆవిర్భావం !
2001లో టీ-ఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత కరీంనగర్‌లో నిర్వహించిన ‘సింహ గర్జన’ బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో.. అదే రీతిలో ఖమ్మంలో ‘భారతగర్జన’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి కేసీఆర్ జాతీయ నాయకుడిగా చర్చల్లో ఉండాలని భావిస్తున్నారు. నాడు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఎత్తిచూపి, ఇక్కడి ప్రజల అవసరాలు, సాధించాల్సిన లక్ష్యాలను వెల్లడిస్తూ ఉవ్వెత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. అదే పంథాతో నేడు దేశ ప్రజల అవసరాలు, సంపద సృష్టించే మార్గాలు, రైతు సంక్షేమంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి మరో ప్రజా ఉద్యమానికి బీజం వస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత తొలి బహిరంగ సభ ద్వారా దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్ కదన శంఖారావం పూరించనున్నారు. మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక కాబోతున్నదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా ?
విపక్షాల తరపున కేసీఆర్ ప్రధాని అభ్యర్థిగా ఖమ్మం సభ తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. అయితే కేసీఆర్ కన్నా బలమైన ప్రాంతీయ పార్టీల నేతలయిన కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లాంటి వారు ఉండగా.. కేసీఆర్ ను ఎందుకు ప్రకటిస్తారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు . కానీ బీజేపీపై యుద్ధం చేయడంలో కేసీఆర్ అందరి కన్నా ముందు ఉన్నారని.బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.