BJP Vs TRS Publicity : బీజేపీ ప్రచారం - టీఆర్ఎస్ డబుల్ ప్రచారం ! ఈ రాజకీయం పోటాపోటీ
ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ టీఆర్ఎస్, బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రచారాన్ని తగ్గించేదందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
BJP Vs TRS Publicity : భారతీయ జనతా పార్టీ తమ అత్యున్నత కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. తెలంగాణలో అధికారాన్ని టార్గెట్ చేసుకుని ఈ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని భావిస్తున్న టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ పబ్లిసిటీ ప్రారంభించింది. దీంతో హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా బీజేపీ హోర్డింగ్‌లకు పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వివిధ అంశాలను తెరపైకి తెస్తోంది.
బీజేపీకి చాన్స్ లేకుండా యాడ్ ఏజెన్సీలను బుక్ చేసుకున్న టీఆర్ఎస్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కారణంగా తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ గురించే చర్చ జరుగుతోంది. దీన్నించి దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే సాలు మోదీ అటూ ఫ్లెక్సీలను ప్రతీ చోటా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో హోర్డింగులన్నీ తామే బుక్ చేసేసుకున్నారు. బీజేపీకి చోటు లేకుండా చేసుకున్నారు. ఈ వివాదం ఇప్పటికీ సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా.. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వాటికి గ్రేటర్ అధికారులు ఫైన్స్ వేస్తున్నారు. బీజేపీ నేతలు ఎక్కడైనా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీసి వేస్తే తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
ఈటల భూములు - పార్టీల్లో చేరికలతో టీఆర్ఎస్ హడావుడి
అదే సమయంలో బీజేపీని ఇబ్బంది పెట్టే ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల కిందట ఈటలకు చెందిన జమున హెచరీస్ భూముల విషయాన్ని తెరపైకి తెచ్చింది. జమున హ్యాచరీస్ భూములను దళితులకు పంచినట్లుగా ప్రకటించింది. అయితే బీజేపీ నేత ఈటల, ఆయన భార్య జమున మాత్రం .. అసలు తాము కబ్జా చేయనిదే ఎలా పంచుతారని ప్రశ్నించారు. సంబంధం లేని భూములు పంచేసి లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో బీజేపీ నేతలను వరుసగా టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. నిన్న గ్రేటర్.. ఇవాళ వరంగల్ కార్పొరేటర్లకు కండువా కప్పారు.
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో శనివారం భారీ ర్యాలీ
మరో వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న రోజుునే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజూ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతుండటం, యశ్వంత్ సిన్హా వస్తుండటంతో మీడియాలో కవరేజ్‌కు యత్నం చేస్తున్నారు. అదే సమయంలో 3 వతేదీవరకు జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర పత్రికల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలను పెద్ద ఎత్తున ఇవ్వనున్నారు. ఈ కారణంగా బీజేపీ సమావేశాలకు కవరేజీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మీడియాలో జరిగే ప్రచారం కీలకం కావడంతో.. ముందుగా ప్రచారాన్ని నియంత్రించడానికి కేటీఆర్ టీం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. దీంతో బీజేపీ నేతలు రివర్స్ అస్త్రాల కోసం ప్రయత్నిస్తున్నారు.