TS BJP : తెలంగాణలో బీజేపీలో ఆధిపత్య పోరాటం - ఈటలను అందరూ దూరం పెడుతున్నారా ?
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరాటం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈటలను అందరూ దూరం పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
TS BJP : తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరిందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే.. పార్టీ నేతలు పట్టించుకోలేదు. దీనిపై అమిత్ షా కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటలను పట్టించుకోకపోతూండటంపై పార్టీ నేతలపై షా సీరియస్ అయ్యారని అంటున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నాయకుడిగా బలం పుంజుకున్నారు. గతంలో కరీంనగర్ వరకూ మాత్రమే ఆయన తెలుసు. కానీ ఇప్పుడు ఆయన హాట్ ఫేవరేట్ లీడర్ అయ్యారు. అందుకే పార్టీలో గతం నుంచి పట్టు సాధించిన నేతలు.. కొత్తగా చేరిన వారూ ఆయన అధిపత్యాన్ని తగ్గించడానికి తమ ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఆ పార్టీలో గందరగోళం ఏర్పడుతోంది.
బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి వర్గం ఆధిపత్య పోరాటం
తెలంగాణ బీజేపీలో రెండే రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతూనే ఉంది. అందులో ఒకటి బండి సంజయ్ వర్గం అయితే మరొకటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్గం రిద్దరికీ మొదటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. బీజేపీలో ఎక్కువగా బండి సంజయ్‌కు ఫాలోయింగ్ ఉందనేది కాదనలేని సత్యం. కిషన్‌రెడ్డి బండి సంజయ్‌కంటే సీనియర్. ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బండి సంజయ్ మొదటి సారి ఎంపీగా గెలిచారు. అయినా తన హవా మాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్నారు. తెలంగాణలో వరుస విజయాలు.. పాదయాత్రతో హైకమాండ్ దృష్టిలోనూ బలమైన నేతగా గుర్తింపు పొందారు బండి సంజయ్.
సీఎం పదవిపై ఇప్పటి నుండే రేస్ ప్రారంభమైందా?
తెలంగాణ బీజేపీలో ఇటీవలి కాలం వరకూ తిరుగులేని నేతగా ఉన్నారు కిషన్ రెడ్డి. అయితే ఆయన ఢిల్లీ రాజకీయాలకు వెళ్లారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన హవాకు బండి సంజయ్ రూపంలో గండి పడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవ్వాలనేది కిషన్ రెడ్డి కోరిక. బీజేపీని చాలా కాలం కాపు కాసిన ఆయన అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ బీజేపీకి ఓ ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడూ తాను సీఎం అభ్యర్థినని చెప్పుకోలేదు కానీ.. పలు రకాల హామీలు ఇస్తూంటారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఫలానాది చేసేస్తాం అని చెబుతారు. దీన్ని బట్టే ఆయన సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారని అనుకోవచ్చు.
ఈటలకు ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్న బండి సంజయ్
మరో వైపు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ .. హుజూరాబాద్ గెలుపుతో కేసీఆర్ ను ఢీకొట్టి గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన కూడా బీసీ నేతగా సరైన గుర్తింపు కోరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బండి సంజయ్.. తనకు పోటీగా మరో నేత రావడం భరించలేకపోతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో నేతలపై కొన్ని సార్లు బండి సంజయ్ చేసిన కామెంట్లు ఈటల గురించేనని చెబుతూంటారు. ఈటల రాజేందర్ కు పార్టీలో నైతికంగా లభిస్తున్న మద్దతు కొంతే. ఈటల చేరిక కమిటీ చైర్మన్‌గా ఉన్నా.. ఆయన దగ్గరకు రాకుండానే బండి సంజయ్ పలువురున్ని తీసుకెళ్లి బీజేపీలో చేర్పించారు. ఇలాంటివి జరుగుతూండటంతో బీజేపీలో వర్గ పోరాటం వెలుగులోకి వస్తోంది.
అయితే తెలంగాణ బీజేపీ.. కాంగ్రెస్ తరహాలో లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలు మీడియాకు ఎక్కుతారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రంఈ పోరాటం అంతర్గతంగానే ఉంటుంది. అందు వల్ల క్యాడర్‌లో ప్రత్యక్షంగా వీరి పోరాటం ప్రభావం చూపించదు.