HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Telangana High Court Contempt Case HYDRAA: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సీఎం రేవంత్ ఎంత సపోర్టుగా ఉన్నా ఆయనను తప్పించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొత్త అధికారిని నియమిస్తారా?

IPS AV Ranganath Contempt Case: హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ, దాని నిర్వహణా తీరుపై తెలంగాణ హైకోర్టు తీసుకున్న కఠిన వైఖరి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సికింద్రాబాద్ లోతుకుంటలోని ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ ఆస్తులకు సంబంధించిన 40 ఎకరాల భూవివాదంలో కోర్టు ముందస్తు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలకు దిగడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారి, హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఆయనను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తప్పించి , ప్రత్యామ్నాయ అధికారినీ నియమించాలని హైకోర్టు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
రంగనాథ్‌కు మద్దతుగా సీఎం రేవంత్
న్యాయస్థాన ఆదేశాల ప్రకారం ఐపీఎస్ రంగనాథ్‌పై కేవలం ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడం, శాసన వ్యవస్థ నిర్దేశించిన పరిధి దాటి ప్రవర్తించారని ధర్మాసనం వ్యాఖ్యానించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, కోర్టు ఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఏ అధికారిని ఎక్కడ నియమించాలో, బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించే కార్యనిర్వహణాధికారం పూర్తిగా ప్రభుత్వానిదే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా ద్వారా భూమి ఆక్రమణదారుల నుంచి చెరువులను రక్షించడం తమ ప్రాధాన్యత అని, హైకోర్టు ఉత్తర్వులపై పూర్తి స్థాయి న్యాయ సలహాలు తీసుకుని ముందడుగు వేస్తామని చెప్పారు.
న్యాయపరమైన పోరాటం చేసే అవకాశం
కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి స్టే తెస్తుందా అనేది ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, కోర్టు ఆదేశాలను నేరుగా ధిక్కరించడం సాధ్యపడదు కాబట్టి, ప్రభుత్వం చట్టపరమైన పరిష్కారాల వైపే మొగ్గు చూపుతోంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అప్పీలులో రంగనాథ్ నియామకం, నిబంధనల ఉల్లంఘనపై ఉపశమనం లభించకపోతే, రంగనాథ్‌ను మరో విభాగానికి బదిలీ చేసి, హైడ్రా బాధ్యతలను క్లీన్ ఇమేజ్ ఉన్న మరో సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారికి అప్పగించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందంటున్న విపక్షాలు
మరోవైపు, ప్రతిపక్ష బిఆర్ఎస్ , బీజేపీలు హైడ్రా విఫలమైందనడానికి, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగిస్తోందనడానికి కోర్టు వ్యాఖ్యలే సాక్ష్యమని విమర్శలు గుప్పిస్తున్నాయి. పదివేల కంటే ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసులు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయని, పొలిటికల్ ప్రొపగాండా కోసం ప్రతిపక్షాలే హైడ్రాపై కుట్రపూరితంగా కేసులు వేయిస్తున్నాయని రేవంత్ రెడ్డి ప్రత్యారోపణ చేశారు. విధానపరమైన లోపాలు, గైడ్‌లైన్స్ లోపించడం వల్లే హైడ్రా ఇలాంటి చిక్కుల్లో పడిందనే విమర్శను తుడిచిపెట్టేందుకు హైడ్రా చట్టబద్ధత సమగ్ర నిబంధనావళి ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
హైడ్రా అధిపతి బదిలీ వ్యవహారం కేవలం ఒక అధికారి ఉద్యోగ రక్షణకు సంబంధించినది మాత్రమే కాదు; కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద పరిపాలనా సంస్కరణల విశ్వసనీయతకు సంబంధించిన అంశం. కోర్టు విధించిన గడువులోగా రంగనాథ్ స్థానంలో కొత్త అధికారి వస్తారా, లేదా న్యాయపోరాటం ద్వారా రంగనాథ్‌ను కొనసాగిస్తూనే హైడ్రా బుల్డోజర్ స్పీడ్‌కు చెక్ పడకుండా ప్రభుత్వం కాపాడుకుంటుందో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















