HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
AV Ranganath: హైడ్రా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ, ప్రైవేటు ఆస్తుల ఆక్రమణపై హెచ్చరికలు జారీ చేస్తోంది. సైన్యం స్వయంగా హైడ్రా సాయం కోరడం ఆసక్తికరంగా మారింది.

Secunderabad Cantonment Lands: హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణ ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన హైడ్రా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతుందని ప్రచారం పొందిన ఈ సంస్థ, ఇటీవల కొన్ని చర్యల వల్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను విస్మరించి ముందుకు వెళ్తున్నారంటూ న్యాయస్థానం చేసిన ఘాటు వ్యాఖ్యలు, అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్‌ను అరెస్టు చేయిస్తాం అని హెచ్చరించడం రాష్ట్ర రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని హైడ్రాపై విమర్శలు
ఈ వివాదానికి ప్రధాన కారణం హైడ్రా కమిషనర్ రంగనాథ్ , సిబ్బంది అనుసరిస్తున్న శైలేనని బాధితులు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, నోటీసులు ఇవ్వకుండా లేదా సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ప్రైవేటు ఆస్తుల చుట్టూ కంచెలు వేయడం, కూల్చివేతలకు దిగడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తూ పరిధి దాటి ప్రవర్తిస్తే ఎంతటి ఉన్నతాధికారినైనా చట్టం ముందు నిలబెడతామని న్యాయమూర్తి స్పష్టం చేయడం, పరిపాలనా యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరికగా మారింది. చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకుండా చేసే ఏ చర్యైనా రాజ్యాంగ విరుద్ధమేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
తమ భూముల రక్షణకు హైడ్రా సాయం కోరిన ఆర్మీ అధికారులు
అయితే, ఈ విమర్శలు , కోర్టు ఆగ్రహం ఒకవైపు నడుస్తుండగానే.. మరోవైపు మిలిటరీ/ఆర్మీ యంత్రాంగం స్వయంగా హైడ్రా సాయాన్ని అర్థించడం అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ , పరిసర ప్రాంతాల్లో ఆర్మీకి చెందిన రక్షణ శాఖ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై సైనిక అధికారులు హైడ్రా కమిషనర్‌ను కలిసి సహాయం కోరారు. రక్షణ స్థలాలను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేయడంలో సహాయపడాలని కోరడం ఒక రకంగా ఈ వ్యవస్థకు ఉన్న క్షేత్రస్థాయి ప్రాధాన్యతను, ఆక్రమణలను అడ్డుకునే శక్తిని చాటుతోంది.
హైడ్రా పనితీరుపై భిన్న స్పందనలు
ఈ రెండు పరస్పర విరుద్ధమైన సన్నివేశాలు హైడ్రా పనితీరులోని రెండు కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. ఒకవైపు ఆర్మీ వంటి వ్యవస్థలు సైతం ఆక్రమణల నిరోధానికి హైడ్రాను సంప్రదిస్తుంటే, మరోవైపు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు, చట్టపరమైన పరిమితులను దాటి ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం బలపడితే అది ప్రభుత్వ గ్రాఫ్‌ను ప్రభావితం చేసే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
విరుచుకుపడకుండా చట్టపరంగానే వెళ్లాలి!
ప్రస్తుతం తలెత్తిన ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే హైడ్రా అధికారులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడం సమర్థనీయమే అయినప్పటికీ, ప్రతి చర్యకూ చట్టబద్ధత, ముందస్తు నోటీసులు, రెవెన్యూ, మున్సిపల్ పరిధుల స్పష్టత తప్పనిసరి. న్యాయస్థానాల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ, పారదర్శకతతో వ్యవహరించినప్పుడు మాత్రమే హైడ్రా వ్యవస్థ తన విశ్వసనీయతను కాపాడుకోగలదు. లేనిపక్షంలో రాజకీయ వేధింపుల సాధనంగా, చట్టాన్ని అతిక్రమించే వ్యవస్థగా ముద్రపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు






















