HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Lothukunta Land Dispute: లోతుకుంట భూముల వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. రంగనాథ్‌ను తప్పించి ఐజీ స్థాయి అధికారిని వేయాలని ఆదేశించింది.

IG Level Officer for HYDRAA: హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ కమిషనర్ ఏవీ రంగనాథ్ వైఖరిపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్కాజ్‌గిరి మండలం లోతుకుంటలోని వివాదాస్పద భూముల్లో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడ్డారన్న పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, చట్టాన్ని, కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడంపై మండిపడింది. ఈ క్రమంలో హైడ్రా సారథ్యం నుంచి రంగనాథ్‌ను వెంటనే తప్పించి, ఆయన స్థానంలో ఐజీ స్థాయి కలిగిన ఐపీఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనంగా మారింది.
లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూవివాదంలో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జరిగిన విచారణలో న్యాయస్థానం అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకే అధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం ఆశ్చర్యకరమని , వ్యవస్థలు చట్ట పరిధికి లోబడి నడుచుకోవాలి కానీ చట్టానికి అతీతంగా వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ఒక జీవో ద్వారా ఉనికిలోకి వచ్చిన ఏజెన్సీ, సివిల్ కోర్టుల, హైకోర్టుల స్టే ఉత్తర్వులను పక్కనపెట్టి చర్యలు చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని తేల్చిచెప్పింది.
హైకోర్టు కఠిన వైఖరితో స్పందించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఆదేశాల మేరకు పూర్తిస్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. న్యాయస్థానం సూచించిన విధంగా ఆయన తన అఫిడవిట్‌లో క్షమాపణ పత్రాన్ని పొందుపరిచారు. న్యాయవ్యవస్థపై, ఉన్నత న్యాయస్థానం గౌరవప్రతిష్ఠలపై తనకు అత్యున్నత గౌరవం ఉందని, కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించే ఆలోచన తనకు ఏమాత్రం లేదని రంగనాథ్ పేర్కొన్నారు. పిటిషనర్ పేర్కొన్నట్లుగా తాము వివాదాస్పద 40 ఎకరాల స్థలంలోకి ప్రవేశించలేదని, వాస్తవాలను దాచి పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని తన అఫిడవిట్‌లో నివేదించారు.
హైడ్రా చేపడుతున్న చెరువులు, ఆక్రమణల పునరుద్ధరణ చర్యలు మంచివే అయినప్పటికీ, అనుసరిస్తున్న పద్ధతి రాజ్యాంగబద్ధంగా ఉండాలని కోర్టు హితవు పలికింది. పోలీసు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం మొత్తం హైడ్రా నిర్ణయాలపైనే ఆధారపడుతుండటాన్ని తప్పుబడుతూ, అధికారులకు చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఉండాలని పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం, పారదర్శకతను పునరుద్ధరించడానికి ఐజీ స్థాయి అధికారికి నేతృత్వ బాధ్యతలు అప్పగించడమే సరైన మార్గమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Hyderabad: The Telangana High Court has ordered the Chief Secretary to remove Ranganath from the post of HYDRA Commissioner. The court remarked that it is inappropriate for a senior official to defy court orders on so many occasions. pic.twitter.com/eHfFxL3bBz
— Naseer Giyas (@NaseerGiyas) July 27, 2026
ఒకవైపు ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తున్నందుకు రంగనాథ్‌కు ప్రజాదరణ లభించినప్పటికీ, న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం . దర్యాప్తు సంస్థలు ఇకపై ఏ చట్టపరమైన చర్యలు చేపట్టినా కోర్టు ముందస్తు అనుమతులు మరియు నిర్దేశిత ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈ సంచలన తీర్పు స్పష్టం చేసినట్లయింది.
ట్రెండింగ్ వార్తలు






















