KCR New National Party: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్, ప్రగతిభవన్‌లో కీలక సమావేశం - గులాబీ బాస్ స్ట్రాటజీ ఇదేనా !
KCR new National Party Bharat Rashtriya Samiti: బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్న సీఎం కేసీఆర్ తన పొలిటికల్ గేమ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
KCR new National Party Bharat Rashtriya Samiti: కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన పొలిటికల్ గేమ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకోవడంలో విఫలమైతుందని, బీజేపీని ఢీకొట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగా సరికొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసి చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. కొత్త పార్టీకి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే భారత్ రాష్ట్రీయ సమితి (BRS) అనే పేరు పరిశీలిస్తున్నారని, జూన్ 19న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నికల అంశంతో పాటు కేంద్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని శుక్రవారం ప్రగతి భవన్‌లో అత్యవసర సమావేశంలో నేతలతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రం మెడలు వంచుతానని పదే పదే చెప్పే కేసీఆర్ అందుకు ఇదే సరైన సమయని, జాతీయ రాజకీయాల్లో చురుకుగా దూసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశంలో చర్చించారు. పార్టీ నేతలతో సమావేశంలో కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. తమ విధానం జాతీయ విధానంగా మారుతున్నాయని ప్రజల్లోకి బలమైన సంకేతాలు తీసుకెళ్లాలి. కేంద్రంలోని బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. కొన్ని సంస్థలకు ఇదివరకే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.
బీజేపీకి ప్రత్యామ్నాయం..
‘కాంగ్రెస్ విపక్ష పార్టీగా విఫలమైంది. కనుక బీజేపీని ఎదుర్కొనే ప్ర్యత్యామ్నాయ శక్తిగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రాష్ట్రపతి ఎన్నికలను సైతం కేంద్రానికి ఎదురునిలిచే అస్త్రంగా వాడుకోవాలి. ఎన్డీయేతర పక్షాలను ఏకం చేసి, బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా కేంద్రానికి బుద్ది చెప్పాలి. బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయం. మరోవైపు తెలంగాణ పథకాలు, టీఆర్ఎస్ పాలనకు జాతీయ స్థాయిలో మంచి మార్కులే పడ్డాయి. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం లేదు. మనల్ని ఎదుర్కొనేందుకు ఉద్దేశపూర్వకంగానే కేంద్రం రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.
ఆంక్షలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం భావిస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాల్సిన సమయం వచ్చిందని, అందుకు జాతీయ పార్టీ ఏర్పాటుతో పోరాటానికి నాంది పలకాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీయేతర పార్టీలు ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని పార్టీల నేతలతో వరుస భేటీలు జరపాలని భావిస్తున్నట్లు’ పార్టీ నేతలతో జరిగిన కీలక సమావేశంలో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ‘ప్రజా దర్బార్’ నిర్వహణపై సైతం తెలంగాణ ప్రభుత్వం సందేహాలతో ఉంది. ఈ ప్రజా దర్బార్ కేంద్రంలోని బీజేపీ పెద్దల రాజకీయ ఎజెండా అని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రంపై పోరు కొనసాగించాలని, మరోవైపు జాతీయ రాజకీయాల్లో మార్పులు సాధ్యం కావాలంటే సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావాలని.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ఎంపీలు, ఇతర కీలక నేతలతో ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.