ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
ఆరు హామీలతో తొలి విడత మేనిఫెస్టో రిలీజ్ చేసిన టీడీపీ.. వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తుంది. ఎదురవుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తుందనేది ఇప్పుడు టాస్క్
మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించింది. తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసిన ఆ పార్టీ ప్రజల్లో విస్తృత చర్చకు దారి తీసింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న పథకాలు పీకేస్తారని వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రచారానికి ఈ మేనిఫెస్టోతో కౌంటర్ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఉన్న పథకాల కంటే మరింత మెరగైనవి ఇస్తామంటూ ప్రచారం మొదలు పెట్టింది.
అమ్మ ఒడే తల్లికి వందనం
ప్రస్తుతం సంక్షేమం పేరుతో జగన్ ఇస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెప్పకనే చెప్పింది టీడీపీ. ప్రజల్లో కొత్త అనుమానలు రాకుండా అలాంటి పథకాలనే మేనిఫెస్టోలో పెట్టింది. ప్రస్తుతం అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 15 వేలు ఇస్తున్నారు. స్కూల్ నిర్వహణకు కొంత కట్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇది వర్తిస్తుంది. టీడీపీ అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరు పెడతామని పేర్కొంది. అదే 15 వేలు ఇస్తామని చెప్పింది. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చింది.
45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత కింద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏడాదికి 18 వేలు అందిస్తోంది. దాన్ని కాస్త మార్చిన టీడీపీ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటన చేసింది.
ప్రస్తుతం రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 12వేలు వరకు వస్తుంది. ఇందులో కేంద్రం వాటా కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో దాన్ని 20వేలకు పెంచారు. తాము విజయం సాధిస్తే రైతుకు సంవత్సరానికి 20 వేలు ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం జగన్ సర్కారు ఇవ్వని మహిళలకు ఉచిత ప్రయాణం, మూడు సిలిండర్లు ఫ్రీ, నిరుద్యో భృతి, ఇంటింటికీ కుళాయి, బీసీ చట్టం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న నిబంధనల్లో మార్పులు వంటి వాటిని అదనంగా చేర్చించింది టీడీపీ.
పోలిక చెప్తూ ప్రచారం చేస్తున్న టీడీపీ
గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పోలిక చూడండి... మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ప్రతి సభలో జగన్ చెబుతున్నారు. అదే ప్రచారాన్ని టీడీపీ అందిపుచ్చుకుంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో వస్తున్న డబ్బులు ఎంత తాము అధికారంలోకి వస్తే ఎంత వస్తుందనే కంపారిజన్ చేస్తూ ప్రచారం మొదలు పెట్టారు. లెక్కలతో వివరిస్తూ ఈ ఆరు పథకాలతోనే తాము అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక్కో ఇంటికి లక్షరూపాయలకు పైగా వస్తుందని ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ మేనిఫెస్టోపై కర్ణాటక ప్రభావం
తెలుగుదేశం మేనిఫెస్టోపై కర్ణాటక ఎన్నికల ప్రభావం పడిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి హామీలతోనే కర్ణాటక ప్రజలను ఆకట్టుకుంది కాంగ్రెస్. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యో భృతి, ఉచిత విద్యుత్ లాంటి హామీలి కాంగ్రెస్‌ను అధికారాన్ని కట్టబెట్టాయి. అదే ఫార్ములాను ఇప్పుడు టీడీపీ అమలు చేస్తోంది.
సెటైర్లు మామూలుగా లేవు
టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై సెటైర్లు కూడా బాగా పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ వైసీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టో అంటేనే చంద్రబాబుకు చిత్తుకాగితం సమానమని అందుకే లేని పోని హామీలు ఇస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైఎస్‌ఆర్‌సీపీ అనుకూలంగా ఉన్న వారు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నింటినీ ఇవ్వకుండా మోసం చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు
ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా తయారు చేస్తున్నారని ఇన్నాళ్లూ టీడీపీ లీడర్లు, అనుకూల మీడియా విపరితంగా విమర్శలు చేసింది. ఇప్పడు దానికి మించిన హామీలతో టీడీపీ తొలి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మరి ఆ విమర్శలకు వీళ్లు చెప్పే సమాధానం ఏంటీ అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టిస్తామనే కామెంట్ కాకుండా ఎలా ఆదాయన్ని పెంచుతారనే క్లారిటీ ఇవ్వకుంటే మాత్రం ఇది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది.
హైదరాబాద్ వంటి ఆదాయం తీసుకొచ్చే నగరం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటీ లేదు. మిగతా ఆదాయాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. పన్నులు వసూలు చేయాలి. అంటే ప్రజలపై భారం వేయాల్సిందే. పన్నుల పెంపును కూడా టీడీప వ్యతిరేకిస్తోంది. మరి ఇన్ని ఉచిత పథకాలు ఇవ్వడానికి నిధులు ఎలా తీసుకొస్తారో చెప్పాల్సిన బాధ్యత టీడీపీ నేతలపైనే ఉంటుంది. ఇకపై వాళ్లు ఛేదించాల్సిన టాస్క్ ఇది. ఇప్పుడున్న ప్రభుత్వాని కంటే తాము ఎలా మెరుగ్గా ఆర్థిక నిర్వహణ చేయగలుగుతామో ప్రజలను ఒప్పించి మెప్పించాల్సి ఉంది.
ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టో అనగానే చాలా ఫేక్ మెసేజ్‌లో సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. రుణమాఫీ లాంటి హామీలు టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నాయంటు ప్రచారం నడుస్తోంది. అలాంటి ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టి అసలైన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లడం కూడా టీడీపీకి ఓ సవాల్ లాంటింది.