(Source: Matrize)
Budda Venkanna: టికెట్ రాకపోవడంపై బుద్దవెంకన్న సంచలన వ్యాఖ్యలు - కోవర్టు గేమ్స్‌తోనే సమస్యని విమర్శలు
TDP News: సీట్లు, పదవుల కోసం వీధికెక్కి తూలనాడే మనిషిని తాను కాదన్నారు బుద్దా వెంకన్న. టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు వెంటే రాంబంటులా ఉంటానన్నారు.
Vijaywada Assembly Ticket: విజయవాడ టికెట్ ఆశించి భంగపడ్డ బుద్దా వెంకన్న ఇన్ని రోజుల తర్వాత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు తనకు దైవ సమానులని అన్నారు. తాను టికెట్ ఆశించానని.. అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. టిడిపిలో అయారాం, గయారాంలు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ ఇస్తే పొగుడుతారు, లేదంటే దిష్టిబొమ్మ తగల పెడతారని విమర్శించారు. తాను మాత్రం చంద్రబాబుకు ఆంజనేయుడి వంటి వాడినన్నారు. చంద్రబాబును అభ్యర్దించాలే కానీ డిమాండ్ చేయకూడదని సూచించారు. చంద్రబాబుకు రామబంటు అనే పదం నా జీవితంలో నిల పెట్టుకుంటానన్నారు బుద్ద వెంకన్న.
ఆ టైపు నేను కాదు: బుద్దా వెంకన్న
సీట్లు, పదవుల కోసం వీధికెక్కి తూలనాడే మనిషిని తాను కాదన్నారు బుద్దా. టిక్కెట్ ఇవ్వకుంటే దూషించే వారు వేరు మనం వేరంటూ సెటైర్లు వేశారు. కేశినేని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాగా నీచ రాజకీయాలు చేయబోమన్ని అన్నారు. టిడిపి పాలిట్ బ్యూరోలో పది మంది ఉన్నారని జగన్ ఇంటి ముట్టడికి ఒక్కరు రాకపోయినా తాను ఒక్కడినే వెళ్లానన్నారు. మొన్న జాబితాలో తన పేరు లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు బుద్ద. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా తాను బాబూతోనే ఉంటానని స్పష్టం చేశారు.
టికెట్ ఇవ్వాలని కోరుతున్నా
రేపు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి... పోయే వారే ఎక్కువ మంది ఉంటారని వెల్లడించారు బుద్ద వెంకన్న. తాను మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుతోనే ఉంటానన్నారు. రేపు చంద్రబాబుకు ఇబ్బంది వస్తే అడ్డుకునేందుకు పక్కనే ఉండాలని తన కోరికన్నారు. చంద్రబాబుని తిడితే ఒక్క నాయకుడు కూడా స్పందించ లేదన్నారు. తాను ధైర్యంగా వెళ్లి వాళ్లను అడ్డుకున్నానని సవాల్ చేశానని గుర్తు చేశారు. చంద్రబాబు కటౌట్‌కు రక్తంతో కాళ్లు కడిగానని వెల్లడించారు. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డుగా నిలిచిందన్నారు. తనకు చంద్రబాబు దేవుడు... అతనే నా ఆరాధ్యమన్నారు. తన కష్టం గుర్తించి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నానని అభ్యర్థించారు అడగటం తమ ధర్మమని... ఆశీర్వదించి పంపుతారని భావిస్తున్నానని అన్నారు.
విజయవాడ బలహీన వర్గాల అడ్డా
టిక్కెట్ ఇవ్వకుంటే రోడ్ ఎక్కే మనస్తత్వం తనది కాదన్నారు వెంకన్న. చంద్రబాబు కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు విజనరీ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కొన్ని కులాల వారే పోరాటం చేస్తారనుకోవడం తప్పు అని తెలిపారు. విజయవాడ గడ్డ ... బలహీన వర్గాల వారి అడ్డా అన్నారు. తన అభిమానులు అందరూ ఆవేదనతో ఈ సమావేశం పెట్టారని... ఎక్కువ తక్కువ మాట్లాడినా తప్పు అనిపిస్తే క్షమించండన్నారు. తాను మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే భావిస్తున్నానని... ఇవ్వాలని కోరుతున్నానని ప్రాధేయపడ్డారు. ఒకవేళ చంద్రబాబు ఇవ్వకపోయినా ఆయనతోనే కలిసి నడుస్తానని తేల్చి చెప్పారు. సీటు కోసం బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం తెలియదన్నారు. చంద్రబాబు కాళ్లను రక్తంతో కడగటానికి సిద్దమన్నారు. ఈరోజు నుంచి ఎటువంటి సమావేశాలు, సభలు పెట్టడం లేదని పేర్కొన్నారు. సీటు ఆశిస్తున్నా.... ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు. అందరూ సమన్వయంతో ఉండాలి... చంద్రబాబు ను సిఎం చేసేలా పని చేయాలని సూచించారు
నాని కోవర్టు గేమ్స్
కేశినేని నాని పెద్ద కోవర్టన్నారు బుద్ద వెంకన్న. తాను ఫ్లైఓవర్ ఉద్యమం చేస్తే... తనకు పేరు వచ్చిందని కేశినేని నాని తన గొప్పగా చెప్పాడన్నారు. చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి తేస్తే ఆయన ఖాతాలో వెసుకున్నారని విమర్శించారు. విజయవాడ ఇన్ ఛార్జిగా తాను ఉంటే ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనను తొలగించాలని అనేక కుట్రలు చేశాడన్నారు. ఆరోజు సుజనా చౌదరి అది కరెక్ట్ కాదని ఆపారని వివరించారు. వెల్లంపల్లితో లాలూచీ పడి... కేశినేని నాని కోవర్టు అయ్యాడన్నారు. తనతో కేశినేని నాని ఆట మొదలెట్టాడు... ఆయన ఆట తాను కట్టిస్తానని సవాల్ చేశారు బుద్ద వెంకన్న. పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నాని ఆట కట్టిస్తానన్నారు. నేడు కూడా పాత పరిచయాలతో తనకు అడ్టు పడుతున్నాడన్నారని విమర్శించారు. నా జోలికి వచ్చారని తప్పకుండా తిరిగిస్తా అన్నారు. ఒక పార్టీలో ఉంటూ... మరో పార్టీకి ఊడిగం చేసిన కోవర్టు కేశినేని నాని తీవ్ర ఆక్షేపణ చేసారు. ఆయనలా తాను చేయలేనన్నారు.