Tdb B Forms: టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేత - 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు
Andhrapradesh News: ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. అయితే, 5 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు.
Chandrababu Distributed B Forms To Candidates: ఏపీలో నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఆదివారం ఉదయమే అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతా కృషి చేయాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసిన ఆయన.. పార్టీ గెలుపు కోసం శ్రమించాలని సూచించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. బీ ఫారం అందుకుంటున్న నేపథ్యంలో నారా లోకేశ్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అమరావతిలో టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించిన చంద్రబాబు గారు.
— Telugu Desam Party (@JaiTDP) April 21, 2024
అభ్యర్ధులు అందరికీ టిడిపి శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున శుభాకాంక్షలు.#TDPJSPBJPWinning #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/vqnOS78LnD
5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు
టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల పొత్తుల్లో బాగంగా టీడీపీ (Tdp) 144 అసెంబ్లీ స్థానాలకు గాను, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, టికెట్లు దక్కని నాయకులు చాలా చోట్ల అసహనం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా 5 చోట్ల అభ్యర్థులను చంద్రబాబు మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల - బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర - ఎంఎస్ రాజు, వెంకటగిరి - కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు.
ఇక ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటివరకూ అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొటిల్ బ్యూరోలోకి తీసుకున్నారు. అటు, పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించిన నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. పాడేరు టికెట్ ను గతంలో వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించగా.. మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే, మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు
ఆ 2 స్థానాలపై సందిగ్థత
ఇవి కాకుండా కూటమి పొత్తుల్లో బాగంగా మరో రెండు స్థానాల్లో కూడా సందిగ్ధత కొనసాగుతోంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో.. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో.. ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. పొత్తు కూటమిలో భాగంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరఫున పోటీలో ఉంటారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
Also Read: YS Sharmila: ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? వైసీపీకి ఓటేస్తే బూడిదలోపోసిన పన్నీరే - షర్మిల