Chandrababu: 'ఆ రౌడీమూకలకు నిద్ర పట్టడం లేదు' - క్రోసూరు ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Andhrapradesh News: పల్నాడు జిల్లా క్రోసూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోతామని తెలిసిన వైసీపీ రౌడీ మూకలకు నిద్రపట్టడం లేదని ట్విట్టర్ లో మండిపడ్డారు.
Chandrababu Anger On Krosuru Incident: రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని తెలిశాక వైసీపీ రౌడీ మూకలకు నిద్రపట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. పల్నాడు జిల్లా క్రోసూరులో (Krosuru) టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రోసూరు ప్రజాగళం సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఓర్వలేక ఈ పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ వైసీపీ వారి నైజం. ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి వైసీపీని తరిమికొట్టాలని కోరుతున్నా.' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక ఈ పనిచేసారు. రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను… pic.twitter.com/AkxtqEu5kR
— N Chandrababu Naidu (@ncbn) April 8, 2024
ఇదీ జరిగింది
పల్నాడు (Palnadu) జిల్లాలోని క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయం అగ్నికి ఆహుతి కాగా.. ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఎన్నికల వెళ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా.. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పోటాపోటీగా ప్రెస్ మీట్‌లు నిర్వహించారు. అనంతరం ఈ కార్యాలయం ఇలా మంటలకు కాలి బూడిదైపోవడంపై చర్చ నడుస్తోంది. 15 రోజుల క్రితం అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయం కూడా ఇలానే అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కార్యాలయం కూడా అదే స్థితిలో కాలిపోయింది. ఈ రెండింటిపైనా పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఇందులో ప్రధాన సూత్రధారులను గుర్తించి అరెస్టు చేసే పనిలో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‌కు చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
'దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు'
సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. వారి కోరిక పై తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ… pic.twitter.com/bwILWRPeoB
— N Chandrababu Naidu (@ncbn) April 8, 2024
అటు, టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్తెనపల్లిలో ఆయన్ను కలిసిన దివ్యాంగులు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ హయాంలో ప్రతి ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశాం. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తాం.' అని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: Pothina Mahesh: ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ - పార్టీకి కీలక నేత రాజీనామా