Nara Lokesh : నారా లోకేష్ సోషల్ గ్యారేజ్ - అడిగిన వారందరి కష్టాలు తీర్చబడును !
Andhra Pradesh : ప్రజా సమస్యలను పరిష్కరించాలనే పట్టుదల ఉండాలి కానీ నాయకులకు అనేక మార్గాలుంటాయి. నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా సమస్యల పరిష్కారనికి చేస్తున్న ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటోంది.
Minister Nara Lokesh TDP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారిలో నారా లోకేష్ ప్రత్యేకమైన ముద్ర వేస్తున్నారు. ఆయన అటు ఎమ్మెల్యేగా... ఇటు మంత్రిగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ తనను సంప్రదించే వారికి కాదనకుండా సాయం చేస్తున్నారు. ఆయన స్పందన చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఓ నాయకుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం పని చేస్తూంటే ఎలా ఉంటుందో.. లోకేష్ పని తీరు అలా ఉంందని ప్రశంసిస్తున్నారు.
గల్ఫ్ బాధితులకు అన్నగా నారా లోకేష్
గోట్ లైఫ్ అనే సినిమా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా చర్చనీయాంశమయింది. ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లిన ఓ వ్యక్తి పడిన కష్టాలతో తీసిన సినిమా అది. ఆ సినిమాపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఓ తెలుగు వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. తాను గల్ఫ్ ఏజెంట్ల మోసానికి గురయ్యి.. ఎడారిలో జీవచ్చవంలా బతుకుతున్నానని విముక్తి కల్పించాలని ఆ వీడియో సారాంశం. లోకేష్ దృష్టి వచ్చిన గంటల్లోనే ఆయనకు భరోసా లభించింది. రెండు రోజుల్లో సొంత గ్రామానికి వచ్చేలా చేశారు. ఎన్నారై టీడీపీ సహకారంతో అతని యజమానిని ఒప్పించి పాస్ పోర్టు ఇప్పించి స్వదేశానికి పంపించారు. అప్పట్నుంచి నారా లోకేష్ సాయం కోసం ఎంతో మంది గల్ఫ్ నుంచి వీడియోలు పెడుతున్నారు. తాము అక్కడ బతకలేకపోతున్నామని విముక్తి కల్పించాలని కోరిన ప్రతి ఒక్కరికీ ఎన్నారై టీడీపీ, ఎంబసీల ద్వారా తక్షణం సాయం అందేలా చేసి.. కుటుంబంతో కలుపుతున్నారు. ఇప్పుడు గల్ఫ్ బాధితులకు లోకేష్ అన్నగా మారిపోయారు.
జగన్‌పై అసంతృప్తి - ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దారెటు ?
ఇతర సమస్యలను కూడా చిటికెలో పరిష్కరిస్తున్న లోకేష్ !
గోదావరి జిల్లాలకు చెందిన బసవయ్య అనే యువకుడు తనకు లక్నో ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిందని కానీ ఫీజు కట్టే స్థోమత లేదని ఆదుకోవాలని లోకేష్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గంట కూడా గడవక ముందే నారా లోకేష్ స్పందించారు. ఫీజు గురించి వదిలేసి.. కలల్ని నిజం చేసుకనేందుకు కృషి చేయాలని మిగతా వాటి సంగతి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. లోకేష్ స్పందన చూసి బసవయ్య ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలను.. శరవేగంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు లోకేష్. ఈ విషయంలో ప్రత్యేకమైన టీమ్ ను పెట్టుకున్నారేమో కానీ.. తనపై నమ్మకంతో పోస్టులు పెట్టిన ఎవర్నీ నిరాశపర్చడం లేదు. తెనాలిలో మూతపడిన ఓ బాలికల హాస్టల్ గురించి ఒకరు ట్వీట్ పెడితే వెంటనే అధికారుల్ని పంపించారు. రోడ్డు సమస్య.. పించన్ సమస్య.. ఇతర సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వస్తే స్పందిస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కమ్యూనిస్టులను మడకశిరలో హౌస్ అరెస్టు చేశారు. దానికి లోకేష్ తాను స్వయంగా క్షమాపణలు చెప్పారు. నారా లోకేష్… తాను ఉన్నానన్న భరోసా ఆపన్నులకు ఇస్తున్నారు.
వాట్సాప్ లోనూ సంప్రదించినా సమస్యల పరిష్కారం
నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఆయన వాట్సాప్‌కు వచ్చిన ఓ మెసెజ్‌తో పాతిక మంది విద్యార్థుల సమస్యను ఇట్టే పరిష్కరించారు. దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్ కు చెన్నయ్ ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు చేస్తున్న పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లో నెట్టింది. వీరి కోసం ప్రత్యేకంగా జీవో కూడా విడుదల చేయించారు లోకేష్. ఈ జీవో వల్ల పాతిక మంది దివ్యాంగ ప్రతిభావంతమైన విద్యార్థులు ఐఐటీల్లో చేరారు. అయితే ఆ తర్వాత ఆయన వాట్సాప్ కు వెల్లువలా మెసెజులు రావడంతో మెటా వాట్సాప్ బ్లాక్ చేసింది. ఈమెయిల్ కు సమస్యలు పంపాలని లోకేష్ కోరారు.
ప్రతిపక్ష హోదా , సీఎం స్థాయి సెక్యూరిటీ కోసం పిటిషన్లు - జగన్ ప్లాన్ ఎవరూ ఊహించలేరా ?
ప్రతి రోజూ మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహణ
నారా లోకేష్ ఆన్ లైన్ ద్వారానే కాదు.. రోజూ ఉదయం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఇంటి వద్ద రోజూ గంట సేపు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఓ ప్రత్యేకమైన బృందాన్ని నియమించుకుని సమస్యలను పరిష్కరించేందుకు అప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. వివిధ శాఖల ప్రమేయం ఉంటే వారికి పంపుతున్నారు. ఎవరికైనా వ్యక్తిగత సాయం చేయాల్సి వస్తే చేస్తున్నారు. దీంతో లోకేష్‌ను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న భావన మంగళగిరి ప్రజల్లో ఏర్పడుతోంది.