MP Raghu Rama Krishna Raju: చంద్రబాబు అరెస్ట్ తీరును కేంద్రానికి చెప్పాం- న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్న ఎంపీ రఘురామ
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. చంద్రబాబు అక్రమ అరెస్టును కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆందోళన చెందొద్దు.. న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టులో కేంద్రానికి కూడా భాగం ఉందా అంటూ.. కొంతమంది టీడీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఈ క్రమంలో... ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు, విధ్వంసాలను రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించానని చెప్పారు. చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేసి... ఏ విధంగా జైల్లో పెట్టారో పూర్తి వివరాలును వారి ముందు ఉంచానన్నారు రఘురామకృష్ణరాజు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వం, పోలీసుల తీరుతో.. రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను కట్టడి చేయాలని కోరాన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని... చంద్రబాబు అరెస్ట్ విషయం ఇప్పటికే కేంద్రం దృష్టికి వచ్చిందని చెప్పారన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. న్యాయం చేస్తామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు.
మరోవైపు... వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరగలేదని.. కావాలనే స్కామ్ జరిగినట్టు క్రియేట్ చేశారని అన్నారు. స్కామ్‌ను క్రియేట్ చేసిన వారిలో ఐఏఎస్ అధికారి సంజయ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఉన్నారన్నారు. వీరిద్దరూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ వెళ్లి... వాళ్లు ప్రెస్‌మీట్ పెట్టాల్సి అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టమని సీఎం జగన్ ఆదేశిస్తే... సీఐడీ చీఫ్ సంజయ్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామ్ జరిగినట్టు సృష్టించారని ఆరోపించారు. గంగానది పుట్టక గురించి తప్పుగా చెప్పిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన జ్ఞానహీనత, బుద్ధి శూన్యతను ప్రపంచానికి తెలియజేశారన్నారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో... ఆ రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేశారని గుర్తుచేశారు రఘురామకృష్ణరాజు. మరి.. మోడీ నిజాయితీని కూడా ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శి హోదాలో నలుగురు అధికారులతో కలిసి ప్రేమ్‌చంద్రారెడ్డి గుతరాజ్ వెళ్లి అధ్యయనం చేశారన్నారు. ప్రేమ్‌చంద్రారెడ్డి ప్రతిపాదిస్తేనే ఈ స్కీమ్‌ను అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో.. ప్రేమ్ చంద్రారెడ్డిని ఎందుకు విచరించాలేదని ఆయన ప్రశ్నించారు. నిధులు విడుదల చేయాలని ఆదేశించింది కూడా ప్రేమ్‌చంద్రారెడ్డే అని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఏ రకంగా చెల్లదని... అందుకే కోర్టులో వాయిదాలు అడుగుతున్నారని అన్నారు రఘురామకృష్ణరాజు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఇంట్రీమ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ... బెయిల్ మంజూరు చేస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు రఘురామరాజు. కేసు ఎంత క్లియర్‌గా ఉన్నప్పటికీ.. రాజమండ్రి జైలర్ సెలవులపై వెళ్లడం, హౌస్ రిమాండ్ అడిగితే ఇవ్వకపోవడం, జైలర్ స్థానంలో మంత్రి బుగ్గన బంధువు రవికిరణ్ బాధ్యతలు స్వీకరించడం, సబ్ జైలర్‌గా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు బంధువు రత్నరాజు విధులు నిర్వహిస్తున్న విధానాలను పరిశీలిస్తే.. ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతుందన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణమాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు ఫోకస్ పెడతానని చెప్పారన్నారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. వైసీపీ అంతానికి ఆరంభం అయ్యిందని.. మరో అరు నెలల్లో ఈ అరాచక ప్రభుత్వం కూలిపోతుందంటూ జోస్యం చెప్పారాయన.