AP Politics : ముందస్తుకు ఏపీ రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయా? ప్రధాన పార్టీలకు ముందే సమాచారం అందిందా ?
ముందస్తుపై ఏపీ రాజకీయ పార్టీలకు ముందుగానే సమాచారం వచ్చిందా ? జమిలీని ఏ పార్టీలైనా వ్యతిరేకించే అవకాశం ఉందా ?
AP Politics : దేశంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఏపీలో చాలా కాలం నుంచే ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలపై గతంలోనే చంద్రబాబు ప్రకటనలు చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలు మళ్లీ ప్రజాతీర్పు కోరాలని సవాల్ చేసినప్పుడు.. బీజేపీ పార్లమెంట్ ను రద్దు చేస్తే తాము కూడా చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత వైసీపీ నేతలు వేగంగా ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తోంది. లోకేష్ పాదయాత్ర వడివడిగా జరుగుతోంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు. వీలైనంత ముందుగా పాదయాత్ర ముగియనుంది. దీనికి కారణం ముందస్తుపై ముందుగా సమాచారం రావడమేనని భావిస్తున్నారు.
రెండేళ్ల కిందటి నుంచే ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. రెండేళ్ల కిందటి నుంచే ఎన్నికల సన్నాహాలు చేస్తోంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించింది. తర్వాత జగనన్న సురక్షతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. పథకాలకు బటన్ నొక్కడానికి వెళ్తున్నా.. అవి జిల్లాల పర్యటనలే. త్వరలో పార్టీ ప్రచార కార్యక్రమాల కోసమూ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల అంశంపై ఓ స్పష్టతకు వచ్చారని చెబుతున్నారు. కేసీఆర్ తరహాలో అత్యధికం సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తారని అతి కొద్ది మందిని మాత్రమే మారుస్తారని అంటున్నారు.
ముందస్తు సమాచారంతో వడివడిగా లోకేష్ పాదయాత్ర
ముందస్తు సమాచారం పక్కాగా ఉండటంతో నారా లోకేష్ వడివడిగా పాదయాత్ర పూర్తి చేస్తున్నారు. రాయలసీమలో సుదీర్ఘంగా పాదయాత్ర చేిసన తర్వాత ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ప.గో జిల్లాలను వేగంగా దాటిపోయారు. ఇప్పుడు తూర్పోగోదావరి జిల్లాకు చేరుకున్నారు. ఇక మూడు ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే పాదయాత్ర ఉంది. నాలుగు వేల మీటర్లను మూడు వందల రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ వైపు అభ్యర్థుల కసరత్తు.. మరో వైపు ప్రచార కార్యక్రమాల కోసం జిల్లా పర్యటనలు పూర్తి చేస్తున్నారు. టీడీపీ క్యాడర్ బిజీగా ఉండేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చాలా కాలంగా చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీకి ఇష్టం లేకపోయినా చంద్రబాబు చెప్పిందే నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.
జమిలీ ఎన్నికలపై పవన్ తో ముందే బీజేపీ పెద్దలు చర్చించారన్న నాదెండ్ల మనోహర్
మరో వైపు జమిలీ ఎన్నికలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో బీజేపీ పెద్దలు ముందుగానే చర్చించారని ఆ పార్టీ కీలక నేత నాదెండల మనోహర్ మీడియాకు చెప్పారు. తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించామన్నారు. అయితే ముందస్తు వస్తాయా లేదా అన్నదానిపై సరైన అంచనాకు రాలేకపోవడం వల్లనే పవన్ కల్యాణ్.. వచ్చే డిసెంబర్ వరకూ.. సగం రోజులు షూటింగ్‌లకు.. సగం రోజులు రాజకీయాలకు కేటాయించాలనుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత ముందస్తుపై వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం ఉంది.