Bengal BJP: బెంగాల్‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Bengal : మమతా బెనర్డీ రాజకీయ వ్యూహాలతోనే బీజేపీ బెంగాల్‌లో తిరుగులేని విజయాన్ని సాధించింది. అతి తక్కువ కాలంలోనే ఉనికి లేని స్థితి నుంచి తిరుగులేని విజయాన్ని సాధించింది.

BJP grew in Bengal with Mamata Banerjee strategies: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన, ఉద్వేగభరితమైన శకం ముగిసింది. దశాబ్దాల పాటు ఎర్రకోటను కాపాడుకున్న కమ్యూనిస్టులను గద్దె దించి, అజేయశక్తి గా ఎదిగిన మమతా బెనర్జీ తృణమూల్ సామ్రాజ్యం కుప్పకూలింది. 2011లో బెంగాల్ మట్టిలో కనీసం ఆనవాళ్లు లేని భారతీయ జనతా పార్టీ, నేడు మూడింట రెండు వంతుల ఆధిక్యంతో సింహాసనాన్ని అధిరోహిస్తోంది. అయితే, ఈ చారిత్రక పరిణామాన్ని లోతుగా విశ్లేషిస్తే.. బీజేపీ సాధించిన ఈ విజయానికి పరోక్షంగా పునాది వేసింది మమతా బెనర్జీయేనన్నది నిష్ఠుర సత్యం.
ప్రతిపక్ష రహిత కాంక్షే శూన్యాన్ని సృష్టించింది
రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తన ప్రత్యర్థిని బలహీనపరచాలని కోరుకుంటుంది. కానీ, మమత ఒక అడుగు ముందుకు వేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావించారు. 2011లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆమె ప్రాధాన్యత పరిపాలన కంటే, వామపక్షాల ఉనికిని తుడిచిపెట్టడంపైనే ఉండిపోయింది. లెఫ్ట్ పార్టీల కేడర్‌ను చెల్లాచెదురు చేయడం, వారి కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆమె ఒక రాజకీయ శూన్యాన్ని సృష్టించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ ఒక ప్రత్యామ్నాయం అవసరం. లెఫ్ట్ పార్టీలను, తాను వచ్చిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం ద్వారా.. ఆ ఖాళీని భర్తీ చేసే అవకాశాన్ని ఆమె స్వయంగా బీజేపీకి కట్టబెట్టారు.
శత్రువును మార్చుకున్న వైనం
బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నిన్నటి దాకా కొడవలి-సుత్తి పట్టుకున్న చేతులే నేడు కాషాయ జెండాను మోస్తున్నాయి. టీఎంసీ నాయకుల అరాచకాలను భరించలేక, క్షేత్రస్థాయిలో తమను కాపాడే దిక్కులేక లెఫ్ట్ కార్యకర్తలు సామూహికంగా బీజేపీ గూటికి చేరారు. మమత తన అణచివేత ధోరణితో తన పాత శత్రువును అంతం చేసే క్రమంలో, అంతకంటే శక్తివంతమైన, జాతీయ స్థాయి వనరులున్న కొత్త శత్రువు బీజేపీ తానే ఆహ్వానించారు. క్లుప్తంగా చెప్పాలంటే, బెంగాల్‌లో బీజేపీకి కార్యకర్తలను సరఫరా చేసింది మమత అనుసరించిన అప్రజాస్వామిక విధానాలే.
అవినీతి, అస్థిరతలపై పెల్లుబికిన ఆగ్రహం
గత పదిహేనేళ్లలో తృణమూల్ పాలనలో పెరిగిపోయిన అవినీతి, సిండికేట్ సంస్కృతిపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో లావా లాగా పేలింది. సందేశ్‌ఖాలీ ఉదంతం నుండి ఆర్.జి. కర్ ఘటన వరకు వరుసగా జరిగిన పరిణామాలు దీదీ మహిళా ఓటు బ్యాంకును సైతం చీల్చివేశాయి. అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా.. గ్రామీణ బెంగాల్ సైతం మార్పు కోరుకుంది. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటల్లాంటి ప్రాంతాలు నేడు బీజేపీకి అఖండ మెజారిటీని అందించడం ద్వారా మమత అహంకార రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు.
తిరుగులేని ఆధిపత్యం.. తిరుగులేని సవాలు!
బెంగాల్‌లో ఇక బీజేపీని అడ్డుకోవడం మమతకు ఇక సాధ్యం కాని పనిలా కనిపిస్తోంది. పదిహేనేళ్ల కిందట సున్నా సీట్లతో ఉన్న పార్టీ, నేడు తిరుగులేని శక్తిగా ఎదగడం ఒక పాఠం. రాజకీయాల్లో ప్రత్యర్థిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ, వారి ఉనికినే లేకుండా చేయాలనుకోవడం ఎంతటి ప్రమాదకరమో మమత ఓటమి నిరూపించింది. తన వ్యూహమే తనకు ఉచ్చుగా మారి, తన చేతులతో తానే పెంచి పోషించిన ప్రత్యామ్నాయ శక్తి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. బెంగాల్ గడ్డపై ఇప్పుడు కాషాయ జెండా రెపరెపలాడుతోంది.. ఇది మమత సృష్టించిన శూన్యం నుండి ఉద్భవించిన నూతన రాజకీయ వాస్తవం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















