AP BJP Meeting: ఈ 21న బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం - చర్చించే అంశాలు ఇవే!
ఈ నెల 21 న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు బీజేపీ రెడీ అయ్యింది. 220 మంది సభ్యులు ఈ సమావేశాలలో భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.
ఈ నెల 21 న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు బీజేపీ రెడీ అయ్యింది. 220 మంది సభ్యులు ఈ సమావేశాలలో భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.
బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం..
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 21న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ బలోపేతం, మండలి ఎన్నికలపై సమీక్ష, భవిషత్ కార్యచరణ పై చర్చించనున్నారు. వీటితో పాటు ప్రజాపోరు -2 ప్రారంభం పై పార్టీ నేతలు చర్చించనున్నారు. వైసీపీకి బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం అవుతుందని ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల దగ్గర నుంచి నేటి వరకు అన్ని ఎన్ని కల్లో పోటీ చేసి ఓటింగ్ శాతం పెంచుకున్నామని ఆయన అన్నారు. జిల్లా పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీల అధ్యక్షులు ఈ సమావేశాల్లో పాల్గోంటారని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు..
బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న క్రమంలో, ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన పార్టీతో కలసి పనిచేసే విషయంపై సైతం జిల్లా పార్టీ నాయకులకు క్లారిటి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సభలో బాహాటంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వైఖరి పై కామెంట్స్ చేసిన నేపథ్యంలో అలాంటి పరిస్థితులను తిరిగి రానియకుండా ఉండేలా కార్యచరణ రూపొందిస్తారని తెలుస్తోంది.
రైతులను ఆదుకోవాలి....
రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం కలిగిందని విష్ణు వర్దన్ రెడ్డి అన్నారు. వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమలో జోరు వర్షాలు కురిశాయని, రైతులు కన్నీరు పెడుతున్నారని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడైనా ఏపీ ప్రభుత్యం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .రైతులను ఆదుకోవడానికి తక్షణ సహాయంతో పాటు పంట నష్టం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
మండలి ఎన్నికల్లో ప్రభుత్వ వైఖరిపై చర్చ...
మండలి ఎన్నికల్లో వైసీపీ నెగ్గిన స్థానాలలో ఒక రకంగా.. ఇంకో పార్టీ గెలిస్తే మరో విధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దర్పం తో విర్రవీగుతుందని, రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసింది బీజేపీ అని తెలిపారు. ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసింది బీజేపీనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీలో నిలిచామని, ప్రతి ఎన్నికల బరిలో పోటీ చేస్తూవచ్చామని తెలిపారు. మండలి ఎన్నికల్లో మొత్తం 11.56 శాతం ఓట్లు బీజేపీ కి వచ్చాయని తెలిపారు. గతం కంటే తమ బలం రాష్ట్రంలో పెరిగిందని అన్నారు.
సంక్షేమ ఫలాల పరిధిలో పట్టభద్రులు లేరు అని సజ్జల మాట్లాడుతున్నారని, ప్రభుత్వ సలహాదారు లాజిక్కులు ఎవ్వరికీ అర్దం కావడం లేదన్నారు. వాళ్ళ సొమ్ములు వారికి ఇస్తున్నారని పట్టభద్రులు భావించారు కాబట్టే ఓట్లు వెయ్యలేదన్నారు. ప్రి ఫైనల్ ఎలక్షన్స్ లో వైసీపీ ప్రభుత్యం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే లను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అర్థం అవుతుందని, అందుకే ఉత్తరాంధ్రలోనే రాజధాని అని చెప్పినా ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.