Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా సేనల బీభత్సం- థియేటర్‌పై దాడి, 300 మంది మృతి
ఉక్రెయిన్‌లో మరియుపోల్‌పై రష్యా వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 300 మంది వరకు మృతి చెందినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ వ్యూహాత్మక తీర ప్రాంత నగరమైన మరియుపోల్‌పై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో మరియుపోల్‌లోని ఒక డ్రామా థియేటర్ నేలమట్టమైంది. ఇందులో ఆశ్రయం పొందుతోన్న సుమారు 300 మంది పౌరుల ప్రాణాలు కోల్పోయారు.
బలమైన రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ కూడా అంతే దీటుగా ఎదుర్కొంటోంది. డజనుకు పైగా ఉన్న మిత్రదేశాలు, అమెరికా కూడా ఉక్రెయిన్‌కు పరోక్షంగా సాయమందిస్తున్నాయి. అన్నింటిని మించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాటలు ఆ దేశ సైన్యాన్ని అలుపెరగకుండా పోరేడేలా చేస్తున్నాయి.
ఐరోపా దేశాల సాయం
రష్యా సైన్యంతో పోరాడేందుకు తమ బలగాలను పంపడానికి ఐరోపా దేశాలు వెనకాడుతున్నప్పటికీ ఆయుధ సామగ్రిని మాత్రం పంపిస్తున్నాయి. పశ్చిమ దేశాల వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతోనే ఉక్రెయిన్.. ఇన్నాళ్లపాటు రష్యాను అడ్డుకోగలిగింది. అయితే ఈ యుద్ధంలో విజయం సాధించడం రష్యా, ఉక్రెయిన్‌కు అంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోజులు గడుస్తోన్న కొద్ది రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత హింసాత్మకంగా మారుతోంది.
రష్యా
నాలుగు వారాల్లో రష్యాకు చెందిన 7 వేల నుంచి 15 వేల మంది సైనికులు మృతి చెంది ఉంటారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరో 30 వేలన నుంచి 40 వేల మంది సైనికులకు గాయాలు కావడం, బందీలుగా దొరకడం, కనపడకుండా పోవడం వంటివి జరిగి ఉంటాయని పేర్కొన్నాయి.
మరోవైపు ఈ యుద్ధంలో 2,500 మంది వరకు పౌరులు మృతి చెంది ఉంటారని ఐరాస తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ లాంటి నగరాలు ధ్వంసమయ్యాయి. దక్షిణ నగరమైన మరియూపోల్‌ను కూడా రష్యా బలగాలు ముట్టడించాయి.