UP CM Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం- కిక్కిరిసిన స్టేడియం
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకుర్ సహా పార్టీ సీనియర్లు, పారిశ్రామిక వేత్తల మధ్య ప్రమాణస్వీకారం చేశారు.
భారీ విజయం
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది.
గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. 1,03,390 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం యోగికి ఇదే తొలిసారి. యూపీ సీఎంగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం పనిచేసి ఓ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.
403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.
యోగి రికార్డు
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో లక్షా రెండు వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
> ఉత్తర్‌ప్రదేశ్ చరిత్రలో ముగ్గురు సీఎంలు మాత్రమే ఐదేళ్ల పూర్తికాలం పాలించారు. వీరిలో యోగి ఆదిత్యనాథ్ మూడో వ్యక్తి.
> యూపీలో గత 15 ఏళ్లలో తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి రికార్డ్. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే సీఎంలుగా ఉన్నారు.
> యూపీలో 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు.
> యూపీని ఇప్పటివరకు పాలించిన నలుగురు ముఖ్యమంత్రుల్లో యోగి మాత్రమే అధికారాన్ని కాపాడుకున్నారు.
Also Read: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అఖండ విజయం ఏం చెబుతోంది?
Also Read: Election 2022: బీజేపీని పడగొట్టడం ఇక ఎవరి వల్లా కాదా...?