హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పలు దేశాల్లో ముడిచమురు, LPG సంక్షోభం ఏర్పడింది. అయితే, ఈ సమయంలో భారత్ కు ఊరట లభించింది. రెండు LPG షిప్ లు సురక్షితంగా హర్మూజ్ దాటి బయటకు వచ్చాయి.

న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారత్‌లో LPG సంక్షోభం తలెత్తింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో భారత్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. భారతదేశానికి చెందిన రెండు LPG నౌకలు శివాలిక్, నందా హర్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయలుదేరాయి. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. దేశంలో గ్యాస్, చమురు సమస్యలు పెరుగుతున్న సమయంలో ఈ రెండు LPG నౌకలు సురక్షితంగా తిరిగి రావడం భారత్‌కు చాలా ముఖ్యం.
హర్మూజ్ జలసంధి నుంచి సురక్షితంగా LPG నౌకలు
శుక్రవారం (మార్చి 13) నాడు ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ భారత్‌కు ఈ సూచనలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటైన హర్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా కోసం భారత్‌కు సురక్షితమైన మార్గం ఇస్తున్నామని అన్నారు. దీని తరువాత, 2 నౌకలు హర్మూజ్ జలసంధి నుండి సురక్షితంగా బయలుదేరి భారత్ వైపు వెళ్తున్నాయని పేర్కొన్నారు.
మార్చి 16-17 తేదీల్లో భారత్‌కు నౌకలు
నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా దీనిపై సమాచారం అందించారు. 'హర్మూజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌లో భారత జెండాతో 24 నౌకలు ఉన్నాయి. వీటిలో 2 LPG నౌకలు శివాలిక్, నందా హర్మూజ్ జలసంధి నుండి సురక్షితంగా బయలుదేరాయి. ఈ 2 నౌకలు భారత్ వైపు వస్తున్నాయి. రెండు నౌకల్లో దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల LPG ఉందని తెలిపారు. ఇవి మార్చి 16, 17 తేదీల్లో గుజరాత్ లోని ముంద్రా, కాండ్లా నౌకాశ్రయాలకు చేరుకుంటాయి అన్నారు.
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలు
రాజేష్ సిన్హా మాట్లాడుతూ.. పర్షియన్ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన 24 నౌకలు ఉన్నాయి. వీటిలో శివాలిక్, నందా సురక్షితంగా బయలుదేరాయి. ఇప్పుడు అక్కడ 22 నౌకలు ఉండగా.. వాటిలో 611 మంది నావికులు ఉన్నారు. భారత నావికులు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
భారత్‌కు ఉపశమనం
రెండు LPG నౌకలు రానుండటంతో భారత్‌కు భారీ ఉపశమనం లభిస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో LPG సిలిండర్ల కోసం ప్రజలు పెద్ద క్యూలలో ఉంటున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మార్చి 5 నుండి ఇప్పటివరకు LPG దేశీయ ఉత్పత్తి 31 శాతం పెరిగింది. దీనితో పాటు, గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించడానికి పలు రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నారు. LPG సరఫరా గురించి వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని, భయపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
గల్ఫ్ ప్రాంతంలో 23 వేల మంది భారత నావికులు
హర్మూజ్ జలసంధికి తూర్పున ఒమన్ గల్ఫ్‌లో 4 భారత నౌకలు ఉన్నాయి. వాటిలో ఒకటి బయలుదేరిన తరువాత అక్కడ 3 భారత నౌకలు మిగిలాయి. వీటిలో 76 మంది భారత నావికులు ఉన్నారు. మొత్తం గల్ఫ్ ప్రాంతం విషయానికి వస్తే.. ఇక్కడ దాదాపు 23000 మంది భారత నావికులు వివిధ నౌకల్లో ఉన్నారు. ఇందులో మర్చంట్ షిప్, ఆఫ్షోర్ షిప్ ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
























