Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Human Metapneumovirus : HMPV వైరస్ వ్యాప్తి ఆందోళనల మధ్య శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొనేందుకు భారతదేశం పూర్తి సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Human Metapneumovirus : చైనాలో వ్యాపిస్తోన్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయంపై ఆ దేశం ఇప్పటికే ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసినప్పటికీ ఆయా దేశాలు ముందస్తు జాగ్రత్తగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కరోనాతో భారీ నష్టాన్ని చవి చూసిన ఆయా ప్రాంతాలు మరోసారి ఆ తరహా పరిస్థితులు రాకుండా అప్రమత్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత్ స్పందించింది. ఎలాంటి శ్వాసకోశ వ్యాధులనైనా ఎదుర్కొనేందుకు భారతదేశం పూర్తి సిద్ధంగా ఉందని వెల్లడించింది.
కొనసాగుతోన్న ఫ్లూ సీజన్‌ను బట్టి చైనాలో పరిస్థితి అసాధారణమైనదేం కాదని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఢిల్లీలో జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR), AIIMS ఢిల్లీతో సహా డివిజన్, హాస్పిటల్స్ నిపుణులు భాగమయ్యారు.
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
చైనాలో పెరుగుతోన్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫ్లూ సీజన్ లో చైనాలో ఈ తరహా పరిస్థితులు సాధారణమేనని తెలిపింది. ఇలాంటి వైరస్ లు ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్నాయని పేర్కొంది. ఇన్‌ఫ్లుఎంజా వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV), హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ వంటి సాధారణ సీజనల్ వ్యాధికారక కారకాలే చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోనూ తీవ్రమైన శ్వాసకోస వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదు కాలేదని చెప్పింది. ఒకవేళ అలాంటివి వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది.
ముందు జాగ్రత్త చర్యగా..
కరోనా రోజులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మరోసారి వైరస్ లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. కొవిడ్ వేరియంట్స్ తో ఏర్పడిన పరిస్థితులు మళ్లీ రాకుండా చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ ను కీలకంగా చేసుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ICMR HMPV కోసం ప్రయోగశాలల పరీక్షల సంఖ్యను మెరుగుపరచాలని యోచిస్తోంది. ఇది ఏడాది పొడవునా సంక్రమించే వైరస్ లను పర్యవేక్షిస్తుంది. ICMR, IDSP నిఘా ప్రకారం, దేశంలో కాలానుగుణ వైవిధ్యాలకు మించి శ్వాసకోశ వ్యాధుల కేసుల పెరుగుదల అంత ఎక్కువగా ఏం లేదని చెప్పింది. అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్‌ల ద్వారా చైనాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందకుండా అన్ని అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను అభ్యర్థించింది.
ఆందోళన అవసరం లేదు
కొత్త వైరస్ పై పుట్టుకొస్తున్న వార్తలపై స్పంచిందిన హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారతదేశంలో అసాధారణ పరిస్థితి లేదని తెలిపారు. డిసెంబర్ 2024 డేటా ప్రకారం దేశంలో అలాంటి మార్పులేమీ లేవన్నారు. శీతాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి సాధారణమేనన్న ఆయన.. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read : Dense Fog Covers Delhi : ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు - ఆలస్యంగా నడుస్తోన్న రైళ్లు - పలు విమానాలు రద్దు