CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Telangana News: తెలంగాణలో అన్నదాతలకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా అమలుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి పథకం అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
CM Revanth Reddy Announcement On Rythu Bharosa: కొత్త సంవత్సర వేళ తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. సచివాలయంలో శనివారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. రైతు భరోసా (Rythu Bharosa) కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ సాయం అందిస్తామని.. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకానికి 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు.
వ్యవసాయ యోగ్యం కాని భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, నాలా భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో అప్ డేట్ చేయలేదని.. అందువల్లే గతంలో కొంతమందికి రైతుబంధు నిధులు వచ్చాయని అన్నారు. దయచేసి ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించాలని పేర్కొన్నారు.
అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం తెలిపారు. ఆర్థిక పరిస్థితి వెసులుబాటును బట్టి రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు సైతం ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. సాగు చేయకపోయినా సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. 'రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు జనవరి 26న అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానం.' అని సీఎం పేర్కొన్నారు.
కేబినెట్ మరిన్ని నిర్ణయాలు
దాదాపు 2 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో ముఖ్యంగా 22 అంశాలున్నాయి. రైతు భరోసాకి ఆమోద ముద్ర వేయడం సహా ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలి.? అనే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయించారు.
అలాగే, జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అటు, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్- 2, ఫేజ్- 3కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15 టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.
Also Read: Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు