Israel Iran War: ఇరాన్ దాడుల్లో 8 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు- ఇజ్రాయెల్ అధికారులు వెల్లడి
Iran War | ఇరాన్ దాడుల్లో 8 మంది మృతి, 200 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.

Israel Iran War Updates | ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఇరాన్‌పై దాడిని ప్రారంభించింది, ఇరాన్ ఇంధన, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ మరోసారి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ యుద్ధంలోకి అమెరికా రంగ ప్రవేశం చేసే అవకాశాలున్నాయి.
ఇరాన్ లోని సైనిక, ఆయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న దాడుల్లో 9 మంది అధికారులు, శాస్త్రవేత్తలు మృతిచెందారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 78 మంది మృతిచెందగా వందల మంది గాయపడ్డారు. అందుకు ప్రతీకారంగా ఇరాన్ సైతం డ్రోన్స్, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. కానీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఆ దాడులను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం జరిగిన దాడుల్లో శిధిలా కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన సమయంలోనే టెహ్రాన్ అంతటా కొత్తగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడిలో గెలీలీ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనంలో నలుగురు మరణించారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ తాజా దాడులను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి సైతం పిలుపునిచ్చింది.
🚨 BREAKING: Daylight reveals the full scale of devastation in Bat Yam, south of Tel Aviv, Israel after deadly Iranian strike.
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 15, 2025
🔴 4 confirmed dead
🟠 200+ injured
⚫ 35 still missing under rubble
IDF, ZAKA, & rescue teams continue nonstop search efforts. pic.twitter.com/ijRjEV85OU
ఇజ్రాయెల్ మంత్రివర్గం సమావేశమైన సమయంలో అర్ధరాత్రి పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం, ఇరాన్ మీడియా సైతం ప్రకటించాయి. ప్రపంచ దేశాల నేతలు యుద్ధాన్ని నివారించడానికి అత్యవసరంగా పిలుపునిచ్చారు. 20 నెలల పోరాటం తర్వాత గాజాలో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్ గ్రూప్ హమాస్‌ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ మరోసారి దాడులు కొనసాగిస్తోంది.
కాగా, శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్ అణు కర్మాగారంపై దాడి తర్వాత నాటాంజ్ అణు కర్మాగారం నుంచి రసాయనాలు లీక్ అవుతున్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సి తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సి, ఇరాన్ 60 శాతం వరకు యురేనియంను అందిస్తున్న ఇరాన్ నాటాంజ్ అణు కర్మాగారం పైభాగం ధ్వంసం కావడం ఆందోళన పెంచింది.






















