Israel Iran War : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో బెంగ పెటుకున్న బాస్మతి బియ్యం!
Israel Iran War : అమెరికా ఆంక్షలతో ఇరాన్‌కు ఎగుమతులు తగ్గాయి, ఇజ్రాయెల్ దాడితో ఈ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పుడు వీటి ఎఫెక్ట్ మన దేశంపై పడనుంది.

Israel Iran War Effect On Basmati Rice : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్యంలో గందరగోళం ఏర్పడింది, ఇది పంజాబ్ నుంచి బాస్మతి బియ్యం ఎగుమతిదారులకు టెన్షన్ పెడుతోంది. వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవానికి, ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం, బాస్మతి బియ్యాన్ని తీసుకెళ్లే అనేక ఓడలు సముద్రంలో ఉన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే, ఓడలు మధ్యలోనే వెనక్కి రావాల్సి వస్తుంది. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది.
పంజాబ్ బాస్మతి ఎగుమతిదారుల సంఘం అశోక్ సేథీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ''ఈ యుద్ధాన్ని తట్టుకోవడం మా వల్ల కాదు. బాస్మతి బియ్యం సహా అనేక సరుకులతో మా ఓడలు ఇప్పటికే సముద్రంలో ఉన్నాయి. ఉద్రిక్తత పెరిగితే, అవి గమ్యస్థానాలకు చేరుకోలేవు, దీనివల్ల మాకు లక్షల నష్టం వాటిల్లుతుంది.''
ఇరాన్ నుంచి సౌదీ వరకు బాస్మతి బియ్యం రవాణా
మధ్యప్రాచ్యం భారతదేశం నుంచి బాస్మతి బియ్యానికి పెద్ద కొనుగోలుదారు. దేశంలో మొత్తం బాస్మతి ఉత్పత్తిలో 40 శాతం పంజాబ్‌లో ఉంది. ఇజ్రాయెల్ శుక్రవారం నాడు ఇరాన్ అనేక అణు, సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమ దేశంపై చేసినందుకు తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
బీమా చేయించుకోవడంలో కూడా ఇబ్బందులు
ఎగుమతి చేసే వస్తువులకు బీమా చేయించుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సేథీ అన్నారు, ఎందుకంటే ఉద్రిక్తత వాతావరణం ఉంది, కాబట్టి బీమా కంపెనీలు కూడా కవరేజీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఇది కేవలం బాస్మతి బియ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. యుద్ధం పెరిగితే చమురు దిగుమతిలో కూడా ఇబ్బందులు వస్తాయి, దీనివల్ల భారతదేశానికి భారీ నష్టం వాటిల్లుతుంది.
బాస్మతి బియ్యం ఎగుమతి తగ్గుతోంది
అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ప్రకారం, 2022లో బాస్మతి బియ్యం ఎగుమతి ద్వారా భారతదేశం విదేశీ మారక ద్రవ్య ఆదాయం 48,000 కోట్ల రూపాయలు, ఇందులో పంజాబ్ వాటా కనీసం 40 శాతం ఉంది.
ఈ మధ్య కాలంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల భారతదేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యంపై ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ భారతదేశానికి సరిగ్గా చెల్లింపులు చేయలేకపోతోంది. అమెరికా ఆంక్షల కారణంగా భారతదేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేసింది. దీనివల్ల రూపాయిలలో భారతదేశానికి చెల్లించడానికి ఇరాన్ వద్ద నిల్వలు లేవు. ఇక్కడ, ఇరానియన్ కరెన్సీ రియాల్ పతనం కారణంగా దిగుమతి కూడా ఖరీదైనదిగా మారింది, కాబట్టి దీనిపై ప్రభావం పడింది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2022లో భారతదేశం మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతి (3.54 బిలియన్ డాలర్లు)లో ఇరాన్ వాటా దాదాపు 23 శాతం (0.81 బిలియన్ డాలర్లు), ఇది ఆర్థిక సంవత్సరం 2025 నాటికి 12 శాతం (0.75 బిలియన్ డాలర్లు)కి తగ్గింది.





















