Israel-Iran War: ఇరాన్ అణుకర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి నిజమే! అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిర్దారణ- లీకేజీ ఉన్నట్టు వెల్లడి
Israel-Iran War: ఇరాన్ ఇజ్రాయెల్ వార్‌లో ఇజ్రాయెల్ ఇరాన్ నాటాంజ్ అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేసింది. దీని వల్ల అక్కడ లీక్ ప్రారంభమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిర్దారించింది.

Israel-Iran War: శుక్రవారం (జూన్ 13, 2025) ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్ అణు కర్మాగారంపై దాడి చేసిన తర్వాత నాటాంజ్ అణు కర్మాగారం లోపల రసాయన లీక్ జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సి ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)ని ఉద్దేశించి ప్రసంగించిన IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సి, ఇరాన్ 60% వరకు యురేనియంను సుసంపన్నం చేస్తున్న ఇరాన్ నాటాంజ్ అణు కర్మాగారం పైభాగం ధ్వంసమైందని తెలియజేశారు. ఇటువంటి సైనిక దాడులు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని హెచ్చరించారు. ఇది ఇరాన్‌ను మాత్రమే కాకుండా మొత్తం ఆ పరిసర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ ఇంకా ఇలా అన్నారు, “ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకోకూడదు. అణు ప్రదేశాల భద్రతకు ముప్పు కలిగించే సైనిక చర్యలు ప్రాంతీయ సంక్షోభానికి దారితీయవచ్చు, అది నియంత్రణ లేకుండా పోతుంది.” అని అన్నారు.
UNSCకి వివరిస్తూ, ప్లాంట్ వెలుపల ఎటువంటి రేడియోధార్మిక లేదా రసాయన లీక్ జరగలేదని, దీని కారణంగా సాధారణ పౌరులు సురక్షితంగా ఉన్నారని, కానీ ప్లాంట్ లోపల తీవ్రమైన రేడియోధార్మిక, రసాయన కాలుష్యం వ్యాపించిందని IAEA చీఫ్ స్పష్టం చేశారు.
IAEA డైరెక్టర్ జనరల్ చెప్పిందేంటీ?
ఇరాన్‌లోని మరో రెండు ప్లాంట్ల గురించి ఇరాన్ అధికారుల నుంచి సమాచారం IAEA తెలుసుకుందని IAEA చీఫ్ ఐక్యరాజ్యసమితికి తెలియజేశారు. అవి ఫోర్డో ఇంధన సుసంపన్న ప్లాంట్, ఇస్ఫహాన్ ప్లాంట్, ఇక్కడ సైనిక దాడులు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే ఈ రెండు ప్రదేశాలపై ఉన్న స్థితి ప్రస్తుతానికి అందుబాటులో లేదు. IAEA చీఫ్ ప్రకారం వీలైనంత త్వరగా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తద్వారా పరిస్థితిని అంచనా వేయగలనని, అణు భద్రత, శాంతి స్థాపనకు సహాయం చేయగలనని గ్రోస్సీ అన్నారు.
పరిస్థితి తీవ్రతను నొక్కి చెబుతూ... ఇరాన్, ఇజ్రాయెల్, మొత్తం అంతర్జాతీయ సమాజ సమస్యల పరిష్కారానికి ఉన్న ఏకైక శాశ్వత మార్గం చర్చలు, దౌత్యమే. ఇది శాంతి, స్థిరత్వం, సహకారాన్ని పెంపొందిస్తుంది.
శుక్రవారం రాత్రి మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్
శుక్రవారం రాత్రి కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడి చేసింది, ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ అధికారుల నివాస ప్రాంతాలపై కూడా దాడి జరిగింది. ఎంత నష్టం జరిగిందనేది బయటకు రావడం లేదు.
ఇరాన్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం, దాడుల తర్వాత, టెహ్రాన్‌తో సహా అనేక నగరాల్లో వైమానిక రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ చేశారు. రాజధాని సమీపంలోని పాస్టర్ స్క్వేర్ చుట్టూ భారీ సైనిక కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, అధ్యక్షుడి అధికారిక నివాసం ఉంది.





















