Israel Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం: ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతి- అణు స్థావరాలపై దాడులు, తీవ్ర హెచ్చరికలు!
కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయేల్‌ను నాశనం చేస్తామని ప్రకటనలు చేస్తుండటం వంటి కారణాలతో, పాశ్చాత్య దేశాలు నివారిస్తున్నప్పటికీ, ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో దాడులకు తెగబడింది.

ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున (జూన్ 13, 2025) విరుచుకుపడింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయేల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, మరికొందరు కీలక సైనిక నేతలు, అలాగే మొహమ్మద్ మెహ్ది టెహ్రాంచి, ఫెరెడౌన్ అబ్బాసి అనే ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడిలో మరణించినట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది.
దాడులకు కారణాలు:
గత కొద్దికాలంగా ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని ఇజ్రాయేల్ నమ్ముతోంది. ఈ అణు కార్యక్రమం తమ దేశానికి ముప్పుగా భావిస్తుంది. అంతేకాకుండా, గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయేల్‌ను నాశనం చేస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తుండటం వంటి కారణాలతో, పాశ్చాత్య దేశాలు నివారిస్తున్నప్పటికీ, ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో దాడులకు తెగబడింది.
దాడుల లక్ష్యాలు:
ఇరాన్‌లోని అణు మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. నటాంజ్‌లోని యురేనియం సుసంపన్నత కేంద్రం (uranium enrichment facility), తబ్రిజ్‌లోని అణు పరిశోధనా కేంద్రాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరిగిందని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. దీంతో పాటు, సైనిక స్థావరాలైన ఇస్ఫహాన్, అరాక్, కెర్మాన్‌షా వంటి నగరాల్లో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్ ఫ్యాక్టరీలను కూడా ఈ దాడిలో ధ్వంసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అణు నాయకత్వాన్ని నిర్మూలించడం మరో లక్ష్యం:
గతంలోనూ కోవర్టు దాడులు జరిపి ఇరాన్ అణు కార్యక్రమం చేపట్టకుండా చాలాసార్లు ఇజ్రాయేల్, ఇరాన్‌ను నిలువరించింది. అయినా తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇరాన్ పునరుద్ధరిస్తోంది. తాజాగా ఇజ్రాయేల్ మరోసారి అణు కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులను మట్టుబెట్టింది. అందులో భాగంగానే మిలిటరీ కార్యాలయాలపై, రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపైన, అణు కేంద్రాలపైన దాడులు చేసింది. ఈ దాడుల్లోనే ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, మరికొందరు కీలక సైనిక నేతలు, అణు శాస్త్రవేత్తలు మొహమ్మద్ మెహ్ది టెహ్రాంచి, ఫెరెడౌన్ అబ్బాసి మరణించారు. ఇలా అణు కార్యక్రమానికి నేతృత్వం వహించే నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
ఇజ్రాయేల్‌కు ఇరాన్ సుప్రీం హెచ్చరిక, ఇరాన్ ప్రతి డ్రోన్ దాడులు:
ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ దాడులకు ఇజ్రాయేల్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తమ ప్రతిఘటన తీవ్ర బాధాకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడి తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన ఆర్మీ నాయకుల స్థానాల్లో కొత్త వారిని నియమించినట్లు ప్రకటించారు. ఇజ్రాయేల్ దాడి అనంతరం ఇరాన్ వందలాది డ్రోన్‌లను ఇజ్రాయేల్‌పైకి ప్రయోగించింది. వాటిని తమ ఐరన్ డోమ్‌తో అడ్డుకున్నట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది.






















