Man Hanged To Death In Iran: ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని ఉరితీసిన ఇరాన్ ప్రభుత్వం, సమర్థించిన కోర్టు
Man Spying For Israel Hanged To Death In Iran | ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్తో సంబంధాలు కలిగి ఉన్నాడని, శత్రుదేశానికి సమాచారం అందిస్తున్నాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది.

టెహ్రాన్: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తత పెరుగుతున్న సమయంలో ఇరాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కోసం గూఢచర్యం చేసిన ఒక వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం సోమవారం నాడు ఉరితీసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ న్యాయస్థానం ఈ విషయాన్ని వెల్లడించింది. "మహమ్మద్ అమిన్ మహ్దవి షాయెస్తేహ్ ను ఈ ఉదయం ఉరితీశారు. నిందితుడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేశాడు" అని ఇరాన్ న్యాయస్థానం తెలిపింది. (సియోనిస్ట్ పాలన అనేది ఇజ్రాయెల్ కోసం ఇరాన్ ఉపయోగించే పదం అని తెలిసిందే)
గూఢచర్యంలో దొరికితే ఉరిశిక్షే..
మహమ్మద్ అమిన్ మహ్దవి షాయెస్తేహ్ ను 2023 లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా సైతం ఇజ్రాయెల్ కు మద్దతుగా నేరుగా రంగంలోకి దిగి దాడులు చేస్తోంది. రెండు రోజుల కిందట ఇరాన్ లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబర్స్ తో దాడులు చేసింది. ఈ క్రమంలో గూఢచర్యం చేసి తమ దేశ రహస్యాలు, వివరాలను ఇజ్రాయెల్‌కు అందిస్తున్న వ్యక్తి షాయెస్తేహ్‌ను ఉరితీశారు.
అంతకుముందు, జూన్ 14 న, ఇరాన్ అధికారులు మొస్సాద్ కోసం గూఢచర్యం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని ఉరితీశారు. "పూర్తి క్రిమినల్ విచారణ తర్వాత ఇజ్రాయెల్ మొస్సాద్ గూఢచారిని ఇరాన్ అధికారులు ఉరితీశారు. ఈ తీర్పును ఇరాన్ సుప్రీంకోర్టు సమర్థించింది" అని ఇరాన్ కు చెందిన మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది.
వరుస ఉరిశిక్షలతో ప్రతీకారం
నివేదికల ప్రకారం, డిసెంబర్ 2023 లో ఇరాన్ భద్రతా సంస్థలు నిర్వహించిన అత్యంత కష్టతరమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ సమయంలో ఎస్మాయిల్ ఫెక్రీని అరెస్టు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో నిందితుడికి ఉరిశిక్ష అమలుచేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొత్తం పశ్చిమ ఆసియా శాంతికి ముప్పు కలిగిస్తుండటంతో ఈ చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది.
ఫఖ్రీ అరెస్టు, విచారణ ప్రక్రియ లేదా ఆరోపణలపై ఎక్కువ సమాచారం అధికారులు వెల్లడించలేదు. గూఢచర్యం కేసుల్లో సున్నితత్వం కారణంగా పూర్తి వివరాలు వెల్లడించడం అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. ఇరాన్ న్యాయస్థానానికి చెందిన మిజాన్ వార్తా సంస్థ, ఫెక్రీ డబ్బు కోసం ఇరాన్ రహస్య, సున్నితమైన సమాచారాన్ని మొస్సాద్ కు పంపేందుకు ప్రయత్నించాడని మాత్రం నివేదించింది.
మొస్సాద్ తో సంబంధం ఉంటే ఖేల్ ఖతం..
మే చివరిలో ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసిన నేరంపై పెడ్రామ్ మదాని అనే మరో వ్యక్తిని ఇరాన్ ఉరితీసినట్లు ప్రకటించింది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని అల్బోర్జ్ ప్రావిన్స్ లోని పోలీసులు మొస్సాద్ తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని ఇరాన్ మీడియా పేర్కొంది. తరువాత, ఇరాన్ ఇంటెలిజెన్స్ సర్వీసుల కోసం పనిచేస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఈ కేసులు ఇరాన్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను నిదర్శనం. ఇవి రహస్య ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటాయి. సీక్రెట్ ఆపరేషన్ల ద్వారా ఒకరినొకరు దెబ్బతీసేందుకు చూస్తుంటాయి. రెండు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గూఢచర్యం, విధ్వంసం, వైమానిక దాడులు, ప్రత్యర్థి దేశాల ఏజెంట్ల హత్యలతో ప్రతీకార చర్యలు చేపడుతున్నాయి. టెహ్రాన్ పై వైమానిక దాడులకు ముందే ఇజ్రాయెల్ గూఢచారులు కొందరు ఇరాన్‌లో ఉన్నారు. తమ భూభాగంలోకి ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఇరాన్ అధికారులు చెబుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.






















