US Attacks Iran: ఆట ఇప్పుడు మొదలైందా! అమెరికా దాడి తర్వాత రెండుగా విడిపోయిన ప్రపంచ దేశాలు! ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటీ?
US Attacks Iran: UNSC అత్యవసర సమావేశానికి ముందు రష్యా, చైనా, పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో కాల్పుల విరమణ కోసం ముసాయిదా ప్రతిపాదనను సమర్పించాయి. హార్ముజ్ జలసంధి మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

Iran vs Israel War : ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడి ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విడగొట్టింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ఆరంభమైందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే అమెరికా లక్ష్యం అని ట్రంప్ అన్నారు. ఇరాన్ అణు ముప్పును శాశ్వతంగా అంతం చేయాలని అగ్రరాజ్యం కోరుకుంటోంది. రష్యా, చైనాతో సహా అనేక ముస్లిం దేశాలు అమెరికా దాడిని ఖండించాయి.
అమెరికా దాడి తర్వాత ఇరాన్ తదుపరి అడుగు ఏమిటి?
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ, "ఇరాన్ శాంతియుతంగా పనిచేస్తున్నా అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రకటన, అంతర్జాతీయ చట్టం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT)ని అమెరికా ఉల్లంఘించింది" అని అన్నారు. తమకు అన్ని ఆప్షన్‌లు రెడిగా ఉన్నాయని హెచ్చరించారు.
ఇరాన్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడి, అమెరికన్లు తమ దాడికి ఘాటుగా స్పందిస్తామని చెప్పారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీ, "అణు స్థావరాలు ధ్వంసమైనా, ఆట ముగియలేదు" అని X లో పోస్ట్ చేశారు.
కాల్పుల విరమణ ప్రతిపాదన
రష్యా, చైనా, పాకిస్తాన్ మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ కోసం ముసాయిదా ప్రతిపాదనను సమర్పించాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, మూడు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ముందు మధ్యప్రాచ్యంలో తక్షణ, బేషరతు కాల్పుల విరమణ కోసం ప్రయత్నించాయి. అయితే, అది ఎప్పుడు ఓటింగ్‌కు వస్తోందో మాత్రం తెలియలేదు. ఈ ప్రతిపాదనను ఆమోదించడానికి కనీసం తొమ్మిది దేశాలు ఓటు వేయాల్సి ఉంది. యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా లేదా చైనా వీటో చేయకూడదు.
హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆమోదం
అమెరికా దాడి తర్వాత, ఇరాన్ పార్లమెంట్ హార్ముజ్ జలసంధి మూసివేయడాన్ని ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయం ఇంకా తుది నిర్ణయం కాలేదు. ప్రపంచంలోని చమురు, గ్యాస్ వాణిజ్యంలో దాదాపు 20 శాతం ముఖ్యమైన హార్ముజ్ జలసంధి మూసివేయాలనే నిర్ణయం ఇప్పుడు ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి వద్ద ఉంది.
హార్ముజ్ జలసంధి మూసివేత లేకుండా చేయాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు. ఇలా జరిగితే అది ఆర్థిక ఆత్మహత్య అవుతుందని అమెరికా పేర్కొంది. ఇంధన సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత్ తెలిపింది.
ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడితో చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. "ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని, శాంతిని చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పునరుద్ధరించవచ్చని పునరుద్ఘాటించాము" అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా దాడి బాధ్యతారహితం- రష్యా
ఇరాన్ మూడు అణు స్థావరాలపై అమెరికా దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది బాధ్యతారహితమని అభిప్రాయపడింది. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. "క్షిపణులు, బాంబులతో సార్వభౌమ దేశంపై దాడి చేయాలనే నిర్ణయం బాధ్యతారహితం, దీనిపై ఎలాంటి వాదనలు చేసినా సరే ఇది తప్పే" అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన - చైనా
ఈ మొత్తం ఘటనను చైనా ఖండించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం లక్ష్యాలు, సూత్రాలను అమెరికా ఉల్లంఘించిందని పేర్కొంది. ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచింది. ఇజ్రాయెల్ వెంటనే కాల్పుల విరమణ చేసి, సామాన్య ప్రజల భద్రత కోసం చర్చలు ప్రారంభించాలని చైనా విజ్ఞప్తి చేసింది. న్యాయాన్ని కాపాడటానికి, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరించడానికి చైనా అంతర్జాతీయ సమాజంతో మాట్లాడుతుందని పేర్కొంంది.
అమెరికా దాడి తర్వాత ముస్లిం దేశాల ప్రతిస్పందన
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడిపై సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితిని గమనిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, "ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినాశకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు" అని పేర్కొంది. ఇరాన్‌లో అమెరికా వైమానిక దాడులను ఒమన్ ఖండించింది. దీనిని అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా పేర్కొంది. పరిస్థితిని శాంతింపజేయాలని ఒమన్ విజ్ఞప్తి చేసింది.
ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ఏమి చెప్పింది?
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను పాకిస్తాన్ ఖండించింది. దీనిని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టుగా పేర్కొంది. ఈ ప్రాంతంలో హింస మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి ఒక రోజు ముందు, నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించడమేనని ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఇరాన్ తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉందని పాకిస్తాన్ తెలిపింది.
అమెరికా డెమోక్రటిక్ పార్టీ విమర్శలు
ఇరాన్ ఎన్.ఐ.సి.పై దాడి చేయాలనే తన నిర్ణయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ నాయకులు అన్నారు. ఏ అధ్యక్షుడు ఏకపక్షంగా దేశాన్ని యుద్ధంలోకి నెట్టే నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోకూడదని సెనేటర్ చక్ షుమర్ నొక్కి చెప్పారు.
అమెరికా-ఇజ్రాయెల్‌కు UK మద్దతు
అమెరికా దాడుల తర్వాత, ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. ఒక వైపు, రష్యా, చైనాతో సహా అనేక ముస్లిం దేశాలు అమెరికా దాడిని ఖండించాయి. ఇజ్రాయెల్ అమెరికాకు బ్రిటన్ కృతజ్ఞతలు తెలిపింది. UK ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా అభివర్ణించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఎప్పటికీ అనుమతి లేదని అన్నారు.





















