Israel Iran War: అలా మొదలైన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఏరోజు ఏం జరిగిందంటే?
ఇరాన్–ఇజ్రాయెల్ తీవ్ర రూపం దాల్చింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. అసలు యుద్ధం ఎలా మొదలైంది? ఏ రోజు ఏం జరిగింది? ఎలా సాగిందో తెలుసుకుందాం..

Timeline Of Israel-Iran War: ఇరాన్–ఇజ్రాయెల్ తీవ్ర రూపం దాల్చింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దుతు తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లోని కీలక ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అనుకేంద్రాలపై తమ వద్ద ఉన్న అత్యంత శక్తవంతమైన B–2 స్పిరిట్ బాంబర్లతో ఆమెరికా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని సైనిక విజయంగా ప్రకటించారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. అయితే ఈ యుద్ధం ఎలా మొదలైంది? ఏ రోజు ఏం జరిగింది? ఎలా సాగిందో తెలుసుకుందాం..
జూన్ 13: ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి ప్రారంభం
ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద ఇజ్రాయెల్ రాత్రిపూట విస్తృత దాడులు ప్రారంభించింది. 200 ఫైటర్ జెట్లు నటాంజ్ అణు కేంద్రంపై ప్రత్యక్ష దాడితో సహా ఆరు ఇరానియన్ నగరాల్లో 300లకు పైగా మందుగుండు సామగ్రిని ప్రయోగించాయి. ఈ దాడులలో రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఉన్నతాధికారులతో సహా దాదాపు 20 మంది సీనియర్ ఇరానియన్ సైనికాధికారులు మరణించినట్లు సమాచారం. 78 మంది మరణించగా, 320 మందికి పైగా పౌరులు గాయపడినట్లు టెహ్రాన్ వెల్లడించింది. స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాదాపు 100 డ్రోన్‌లను ప్రయోగించింది. కాగా వీటిని జోర్డాన్ సమర్థంగా అడ్డుకుంది.
జూన్ 14: కొనసాగిన దాడులు.. 10 లక్షల మంది ఆశ్రయాలకు తరలింపు
ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో హింస మరింత పెరిగింది. టెహ్రాన్‌లో ఎత్తయిన అపార్ట్‌మెంట్ భవనం కూలిపోవడంతో 60 మంది మరణించినట్లు సమాచారం. అయితే ఇజ్రాయిల్‌కు అమెరికా మద్దతు తెలపడంతో.. వివాదం మరింత పెరిగితే తమ క్షిపణులు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ హెచ్చరించింది. దాడుల్లో బాట్ యామ్‌లో ఆరుగురు, తామ్రాలో నలుగురు పౌరులు మరణించారు. వైమానిక దాడుల కారణంగా దాదాపు పది లక్షల మంది ఇజ్రాయెలీయులను ఆశ్రయాలకు తరలించారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని అనేక ప్రదేశాలపై ప్రొజెక్టైల్స్ దాడి చేశాయని ఇరాన్ పేర్కొంది.
జూన్ 15: యుద్ధంలోకి ప్రవేశించిన ఇరాన్ మిత్రదేశాలు
ఇరాన్ క్షిపణులు హైఫా, బాట్ యామ్‌లపై విరుచుకుపడ్డాయి. యెమెన్ హౌతీలు జాఫాపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇది ఇరాన్ మిత్రదేశం చేసిన మొదటి దాడి. ఇజ్రాయెల్ ప్రభుత్వ భవనాలు, చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని తన దాడులను విస్తరించాయి. అమెరికాతో చర్చలను టెహ్రాన్ తిరస్కరించింది. దీంతో యూఎస్, ఇరాన్ మధ్య వైరం పెరిగింది.
జూన్ 16: టెల్ అవీవ్‌పై దాడి
ఇరాన్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ తోపాటు హైఫాపై తెల్లవారుజామున దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు తాము కొత్త వ్యూహాన్ని ఉపయోగించామని రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ దీన్ని తోసిపుచ్చింది. ఇరాన్ క్షిపణి లాంచర్లలో మూడో వంతును నాశనం చేశామని, వైమానిక ఆధిపత్యాన్ని ప్రకటించామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న విధ్వంసకారులను సామూహికంగా అరెస్టు చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఇంతలో, సంక్షోభాన్ని తగ్గించడానికి ప్రపంచ ఒత్తిడి పెరగడంతో G7 నాయకులు కెనడాలో సమావేశమయ్యారు.
జూన్ 17: ఇరానియన్ జనరల్ హత్య
ఇరాన్ వార్‌టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ షాద్మానీని నియమించిన నాలుగు రోజులకే చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. విస్తృతమైన ఐడీఎఫ్ వైమానిక దాడులు ఇరానియన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకున్నాయి. కషాన్‌లో ముగ్గురు పౌరులు మరణించినట్లు నివేదికలు వచ్చాయి. ఇజ్రాయెల్ సైనిక నిఘా కేంద్రం, మొసాద్ కార్యాచరణ కేంద్రంపై దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు.
జూన్ 18: సెంట్రిఫ్యూజ్ సైట్‌లపై దాడులు
ఇజ్రాయెల్ వర్గాలు, IAEA ప్రకారం.. ఇజ్రాయెల్ జెట్‌లు టెహ్రాన్, కరాజ్ సమీపంలోని ఖోజిర్ క్షిపణి ఉత్పత్తి కేంద్రంతోపాటు కీలక సెంట్రిఫ్యూజ్ తయారీ ప్రదేశాలపై బాంబు దాడులకు పాల్పడింది. రెండు వైపుల నుంచి క్షిపణుల దాడిని కొనసాగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ జంట క్షిపణి దాడులను ప్రయోగించింది. టెల్ అవీవ్‌పై పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.
జూన్ 19: అమెరికా దాడులపై ట్రంప్ ప్రసంగం
రాబోయే రెండు వారాల్లో ఇరాన్‌పై అమెరికా దాడి ప్రారంభించాలా వద్దా అని తాను నిర్ణయిస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ ప్రకటనను ప్రెస్ సెక్రటరీ ఒక బ్రీఫింగ్ సందర్భంగా విడుదల చేశారు. అమెరికా సైనిక చర్యపై తుది నిర్ణయం తీసుకునే ముందు దౌత్య ప్రయత్నాలు కొనసాగడానికి అనుమతించాలని ఆయన కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 20: ఇరాన్ అధికారులు, యూరోపియన్ నేతల భేటీ
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన సమావేశంలో ఇరాన్ అధికారులు తమ యూరోపియన్ సహచరులను కలిశారు. తమ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఆపడానికి అంగీకరిస్తే అమెరికాతో అణు చర్చలు చేపడతామని వెల్లడించారు. అయినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్‌లో రెండు వైపులా దాడులు కొనసాగుతున్నాయి.





















